వైఎస్ జగన్‌తో ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు భేటీ
⇒ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుకు వినతి
⇒ జగన్ సానుకూలంగా స్పందించారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారుగా అందరికీ చిర పరిచితులైన రాము సూర్యారావు మాస్టారు సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. జగన్ నివాసంలో జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఇందుకు జగన్ సాను కూలంగా స్పందించినట్లు ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు చెప్పారు. జగన్‌తో భేటీ అనంతరం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు.
త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పోటీ చేయని నియోజకవర్గాల్లో తమకు మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరినట్లు తెలిపారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ అభ్యర్థి విఠల బాలసుబ్రహ్మణ్యం, పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి వై.శ్రీనివాసరెడ్డి, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థి అజయ్ శర్మలకు మద్దతు కోరినట్లు చెప్పారు. తమ విజ్ఞప్తికి జగన్ సాను కూలంగా స్పందించారని చెప్పారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ తనకు మద్దతు ఇచ్చిందని మాస్టారు గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని చెప్పినందుకు జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తండ్రికి తగ్గ తనయుడు జగన్ అని కొనియాడారు.