'ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయి'
హైదరాబాద్: కరువు మండలాలపై ప్రభుత్వ నివేదికలో చాలా జాప్యం జరగడం వల్లే ఏపీకి తక్కువ నిధులొచ్చాయని వైఎస్ఆర్ సీసీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏ మూలకు సరిపోతాయని సభలో ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ... జలాలు పెరిగాయి, చాలా జలాలున్నాయి.. కేవలం మా ప్రభుత్వం వల్ల అధికార పక్షం చెప్పుకోవడంపై ఆయన మండిపడ్డారు. నిజానికి నవంబర్ నెలలో సంభవించిన తుఫాను వల్ల కాస్త భూగర్బజలాలు పెరిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా కరువు మండలాలు అంత తక్కువ ఉన్నట్లయితే చాలా జిల్లాల్లో ప్రజలు తాగునీటి కోసం కిలోమీటర్లు ఎందుకు వెళ్లాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం ఇలా చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు.
సామాన్య ప్రజలు ఉపాధిపనులు చేయడానికి 100 రూపాయల కోసం 100 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని కొన్ని పేపర్లలో వచ్చిన కథనాలను సభలో చూపించారు. అక్టోబర్ 4, 5 సమయంలో కరువు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. కానీ ఏపీ ప్రభుత్వం చాలా ఆలస్యంగా మొదట అక్టోబర్ 21న కరువు మండలాలు 196 అని ప్రకటించిందని పేర్కొన్నారు. కరువు మండలాలు 163 ఉన్నట్లు నవంబర్ 21వ తేదీన ప్రకటించింది. నవంబర్ లో వరదలు వచ్చిన తర్వాత కరువు మండలాలు ప్రకటిస్తే సహాయం ఎలా అందుతుందని, కేంద్ర నిధులు ఎలా వస్తాయని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఏపీ ప్రభుత్వం ఆలస్యంగా నివేదిక సమర్పించడం వల్ల 2340 కోట్లు నిధులు అడిగినా తొలి దఫాలో 430కోట్లు, రెండో దఫాలో దాదాపు 280 కోట్లు నిధులోచ్చాయన్నారు. అయితే కేవలం మూడో వంతుకు కూడా సరిపోని సహాయం మాత్రమే కేంద్రం నుంచి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలలో అందాల్సిన ఇన్ పుడ్ సబ్సిడీ రైతులకు ఇప్పటివరకూ ఒక్క రూపాయి అందలేదు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు పార్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు వస్తాయ. ఆర్డబ్ల్యూఎస్ కింద ఆరు నెలలుగా ఒక్క రూపాయి కూడా అందలేదని స్పష్టంచేశారు. ఇంకా చెప్పాలంటే తూర్పు గోదావరి జిల్లాకు 15 లక్షలు, పశ్చిమ గోదావరికి 35లక్షలు కేటాయించారని వైఎస్ జగన్ వివరించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు.