భవిష్యత్తు మనదే
వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఎంపీ మేకపాటి ఉద్ఘాటన
సాక్షి, హైదరాబాద్: ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉంది. రానున్నవి మంచి రోజులు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పార్టీని గెలిపిస్తారు’’ అని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీని స్థాపించి ఐదేళ్లు పూర్తయి, ఆరో ఏట అడుగుపెడుతున్న సందర్భంగా శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మేకపాటి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గపు కార్యక్రమాల్ని ప్రజలంతా గమనిస్తున్నారని, ఆ పార్టీపై వారికి నానాటికీ ఏహ్యభావం కలుగుతోందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
‘‘2019లో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంటే.. 2018 ప్రాంతంలో రాష్ట్ర ప్రజల్లో ఓ రకమైన ఉత్సాహం వస్తుంది. అలాంటిది 2016 నుంచే జనంలో ఆ వాతావరణం నెలకొంది. తాము చంద్రబాబు చేతిలో మోసపోయామని వారు భావిస్తున్నారు. ఈ పరిస్థితిని పార్టీ శ్రేణులు వినియోగించుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఆదరించి నాయకత్వం అప్పగించే అవకాశాలు గొప్పగా ఉన్నాయని, మనమెవ్వరమూ చిన్న పొరబాటు కూడా చేయవద్దని, ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దని ఆయన సూచించారు.
పార్టీ వీడినవారు చింతించే రోజులు ..
పార్టీని వీడి వెళ్లిన ఎమ్మెల్యేలు వెంటనే చింతించే రోజులు వచ్చాయని మేకపాటి అన్నారు. వాస్తవానికి ఈ ఫిరాయింపుల్ని చూసి జనం ఏవగించుకుంటున్నారని, చంద్రబాబుకు ఇదే పెద్ద ‘మైనస్’ అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న పనుల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని మేకపాటి అన్నారు. రాజధాని పేరుతో జరిగిన ‘ఘన’కార్యాలను జగన్ ప్రజలకు చక్కగా వివరించారన్నారు. నూజివీడు, నాగార్జునవర్సిటీ ప్రాంతాల్లో రాజధాని పెడతామని చెప్పి.. చివరకు తన అనుచరులకు మాత్రమే ఆ ప్రాంతం పేరు చెప్పి, దాని చుట్టుపక్కలా భూములు కొనుగోలు చేశాక రాజధానిని ప్రకటించినమాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అంత పేదవాళ్లా మీరు?
రాష్ట్రప్రజల్ని చంద్రబాబు చాలా అమాయకులనుకుంటున్నారని, తనకు వాచీ, ఉంగరం లేదంటే నమ్మేస్తారనుకుంటున్నారని మేకపాటి అన్నారు. నిజంగా సీఎం అంత పేదవారైతే ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.5, 10, 15 కోట్లు పెట్టి ఎలా కొనగలుగుతున్నారని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలన ఒక స్వర్ణయుగమని, అదేబాటలో జగన్ కూడా సంక్షేమ పాలనను అందిస్తారన్న సంపూర్ణ విశ్వాసం తనకుందని ఆయన చెప్పారు.
ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ : రోజా
వైఎస్సార్‌సీపీ ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన పార్టీ అని, మాట తప్పని, మడమ తిప్పని అభ్యుదయవాది జగన్‌మోహన్‌రెడ్డి అని, అలాంటి పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నందుకు తాను గర్వపడుతున్నానని ఆర్.కె.రోజా అన్నారు. అరుదైన రీతిలో పార్టీ పెట్టిన వెంటనే వచ్చిన ఉప ఎన్నికల్లో గెలిచి తన సత్తాను ఢిల్లీకి చాటినవ్యక్తి జగన్ అని ఆమె అన్నారు. మూడేళ్ల తరువాత పార్టీ అధికారాన్ని చేపడుతుందని, 30 ఏళ్లపాటు ప్రజల హృదయాల్లో వైఎస్ నిలిచిపోయేలా పాలన సాగిస్తుందన్నారు.
కార్యక్రమం లో పార్టీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయ ణ, సజ్జల రామకృష్ణారెడ్డి,మండలిలో వైఎస్సార్‌సీపీపక్ష నేత ఉమ్మారెడ్డి , ఎమ్మెల్యేలు కోన రఘుపతి, గిడ్డి ఈశ్వరి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, నేతలు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టి.బాలరాజు(మాజీ ఎమ్మెల్యే), ఎస్.దుర్గాప్రసాదరాజు, విజయచందర్, వీఎల్‌ఎన్ రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, కొండా రాఘవరెడ్డి, కె.శివకుమార్, కొల్లి నిర్మల, చల్లా మధుసూదన్‌రెడ్డి, పు త్తా ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను మేకపాటి కట్ చేశారు.