
ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన ఏదీ?
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2017–18 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థ సారథి విమర్శించారు.
కేంద్ర బడ్జెట్‌పై వైఎస్‌ఆర్‌సీపీ నేత కొలుసు పార్థసారథి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన 2017–18 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలను పూర్తిగా నిరాశ పరిచిందని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కొలుసు పార్థ సారథి విమర్శించారు. జార్ఖండ్, బిహార్ గురించి మాట్లాడిన జైట్లీ.. హోదా కోసం ఉద్యమించిన ఏపీ ప్రస్తావన తేకపోవడం దారుణమని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన చట్టంలో ఇచ్చిన హామీలపై కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావించక పోవడం దారుణమన్నారు. అమరావతికి రైల్వే లైన్ల విషయం కూడా లేదన్నారు. రైతులకు వడ్డీలేని రుణాలు, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా పావలా వడ్డీకే రుణా లు ఇస్తామని చెప్పక పోవడం దురదృష్టకరమన్నారు. ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచినా, రాష్ట్రంలో ఈ పథకం దుర్వినియోగం అవుతోందన్నారు.
అంకెల గారడీ..: మోదీ ప్రధాని అయ్యే నాటికి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 183.5గా ఉంటే నవంబర్ 2016 నాటికి 181.2కు పడిపోయిందని పార్థసారథి వివరించారు. 2015–16లో రూ.35.41 లక్షల కోట్లు ఉన్న గ్రాస్ ఫిక్స్‌డ్ కేపిటల్ ఫార్మేషన్ 2016–17లో రూ.35.30 లక్షల కోట్లకు తగ్గిందని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జీడీపీ 7.1 శాతం నమోదు అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది కేవలం అంకెల గారడీగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారన్నా రు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావ డం వల్ల 17 శాతం రెవెన్యూ పెరిగిందే తప్ప అది ప్రభుత్వ గొప్పదనం కాదని చెప్పారు. బడ్జెట్ బాగుందని బల్లలు చరిచిన టీడీపీ నేతలకు ఏం కనిపించిందో అర్థం కావడం లేదన్నారు. వీరి వల్లే ప్రత్యేక హాదాకు బ్రేక్ పడిందన్నారు.