
చంద్రబాబుది ‘టైర్రర్’ పాలన
ఫలితంలేని దావోస్ పర్యటన ఎందుకు బాబూ: వాసిరెడ్డి పద్మ
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు మద్దతుగా నిలుస్తూ.. ప్రభుత్వ దురాగతాలను అడ్డుకుంటున్న ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం దారుణమని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక ‘టై’ పాలనను సాగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ఆందోళన చేయడమే నేరమన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
నరసరావుపేట నియోజకవర్గంలోని రొంపిచర్లలో రైతులకు మద్దతుగా నిలిచి నిరసన తెలిపిన స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆమె మండిపడ్డారు. తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణీకుల తరఫున మాట్లాడినందుకు అక్కడి మేనేజర్‌తో ఫిర్యాదు చేయించి తమ ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారని ఆమె ధ్వజమెత్తారు.
మిథున్‌రెడ్డి అరెస్టు రాజకీయ కుట్ర అంటూ నిరసన వ్యక్తం చేసిన పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేశారన్నారు. కాల్‌మనీ, సెక్స్ రాకెట్‌పై శాసనసభలో గట్టిగా నిలదీయడానికి ప్రయత్నించిన ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసి టీడీపీ దురాగతానికి పాల్పడిందని పద్మ దుయ్యబట్టారు.
బాబుది పిరికితనం..
పరిపాలనలో ఘోర వైఫల్యం చెందిన చంద్రబాబును ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని, ఓ రకంగా అది ఆయన పిరికితనానికి అద్దం పడుతోందని ఆమె అన్నారు. తన పాలనను ప్రశ్నిస్తున్నారనే భయంతోనే పెట్టుబడులు తెస్తామనే పేరుతో దావోస్ పర్యటనకు పరిగెత్తారన్నారు. గతంలో కూడా పలు మార్లు అక్కడకు వెళ్లిన చంద్రబాబు సాధించిందేమీ లేదన్నారు.