అబుజా: మరోసారి నైజీరియా రక్తంతో తడిసి ముద్దయ్యింది. సోమవారం మధ్యాహ్నం బార్నో రాజధాని మైదుగురి నగర మార్కెట్లో బాంబు పేలి 10 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా రెండు బాంబు దాడులు సంభవించడంతో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన బార్నోఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనలో పది మందికి పైగా మృతిచెందగా, పలువురికి తీవ్ర గాయాలైయ్యాయి.
గతవారం ఉత్తర నైజీరియాలోని కానో నగరంలో మసీదు వద్ద వరుస బాంబు పేలుళ్లు సంభవించి 35 మంది వరకూ మరణించిన సంగతి తెలిసిందే. స్థానికంగా స్థావరాలు ఏర్పరుచుకున్న ఒక ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూపు వరుసగా ఆత్మాహుతి దాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సంవత్సరం ఇప్పటివరకూ టెర్రరిస్టులు జరిపిన దాడుల్లో మూడు వేల మందికి పైగా మృతి చెందారని బార్నో అధికారులు తెలిపారు.