
151 మంది అగ్నికి ఆహుతి
► ట్యాంకర్ బోల్తా పడటంతో పెట్రోల్ కోసం పోటెత్తిన జనం
► అకస్మాత్తుగా పేలిన ట్యాంకర్
► పాక్‌లోని పంజాబ్‌లో దుర్ఘటన
లాహోర్: పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో జాతీయ రహదారిపై ఆదివారం ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆయిల్ ట్యాంకర్ పేలిపో వడంతో 151 మంది దుర్మరణం చెందారు. మరో 140 మంది గాయాలపాలయ్యారు. పవిత్ర రంజాన్ పండుగకు ఒకరోజు ముందు చోటుచేసుకున్న ఈ దుర్ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కరాచీ నుంచి 50 వేల లీటర్ల పెట్రోల్‌తో లాహోర్ వెళ్తున్న ట్యాంకర్ బహవల్‌పూర్ జిల్లా అహ్మద్‌పూర్ వద్ద టైర్ పేలడంతో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్‌లోని పెట్రోల్ లీక్ అయింది. దీన్ని గమనించిన స్థానిక గ్రామాల ప్రజలు పెట్రోల్‌ను తీసుకోవడానికి వందల సంఖ్యలో ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. దీంతో అక్కడ గుమిగూడిన జనం మంటల్లో చిక్కుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ అంటించడం వల్లే పేలుడు సంభవించిందని అధికారులు తెలిపారు. ‘కనీసం 123 మంది వరకు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో 100 మందిని సహాయక సిబ్బంది సమీప ఆస్పత్రులకు తరలించారు. అందులో 50 మంది పరిస్థితి విషమంగా ఉంది’ అని బహవల్‌పూర్ జిల్లా సమన్వయ అధికారి రాణా సలీమ్ అఫ్జల్ తెలిపారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారి జమ్ సజ్జాద్ మాట్లాడుతూ, ‘చాలావరకు శరీరాలు పూర్తిగా కాలిపో యాయి. డీఎన్‌ఏ పరీక్షల ద్వారానే వారిని గుర్తించగలం’ అని వివరించారు.
వెళ్లిపోమని చెప్పినా వినలేదు..
ట్యాంకర్ వద్దకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా వచ్చారని, అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు ఎంత చెప్పినా వారు వినలేదని బహవల్‌పూర్ ప్రాంతీయ పోలీసు అధికారి రాజా రిఫాత్ తెలిపారు. అకస్మాత్తుగా ట్యాంకర్ పేలడంతో సెకన్ల వ్యవధిలో అక్కడున్న వారు మంటల్లో చిక్కుకున్నారని పేర్కొన్నారు. క్షతగాత్రులను తరలించడానికి తన సొంత హెలికాప్టర్‌ను పంపిన పంజాబ్ ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కాగా, రంజాన్ వేడుకలు జరుపుకునేందుకు లండన్ వెళ్లిన ప్రధాని నవాజ్ షరీఫ్ తన పర్యటనను రద్దు చేసుకుని పాక్‌కు తిరుగు పయనమయ్యారు.