రియాక్ట్ అవ్వడానికి సెకన్ లేటైనా..
వేగంగా వస్తున్న విమానం ఫోటోను తీయడానికి ఓ వ్యక్తి చేసిన సాహసం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దీనికి సంబంధించిన 360 డిగ్రీల్లో తీసిన వీడియోను చూసిన వారంతా, వామ్మో రియాక్ట్ అవ్వడంలో సెకన్లలో తేడా వచ్చినా తల ఎగిరిపోయేదేమో అంటున్నారు. ఈ సంఘటన ఉత్తర అమెరికా ఖండంలో సెయింట్ బార్ట్స్ దీవిలోని గస్టఫ్ ఎయిర్ పోర్టు సమీపంలో చోటు చేసుకుంది. మెక్కీ జైదీ అనే పర్యాటకుడు ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడానికి కిందకు దిగుతున్న విమానాన్ని దగ్గర నుంచి ఫోట్ తీయడానికి ప్రయత్నించి తృటిలో తప్పించుకున్నాడు.
'విమాన వేగాన్ని జడ్జ్ చేసి తప్పించుకోవడం కష్టమే, ఆ సమయంలో నేను కెమెరాలో విమానాన్ని బందించాలనుకున్నాను. విమానం సమీపిస్తుండగా సహజంగానే కిందికి వంగి తప్పించుకున్నాను' అని మెక్కీ జైదీ పేర్కొన్నాడు. ఎయిర్ పోర్టు అధికారులు ఆ ప్రదేశంలో వార్నింగ్ బోర్డులు కూడా పెట్టారు. అయితే తాను పబ్లిక్ రోడ్డుపై మాత్రమే ఉన్నానని, నిషిద్ధ ప్రాంతంలో కాదని వివరణ ఇచ్చుకున్నాడు. మిక్కీ జైదీ విమానం సమీపిస్తుండగా 360డిగ్రీలో మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ వీడియోలో విమానం ఆ వ్యక్తిని ఢీకొట్టినట్టుగా చాలా సమీపంలోంచి వెళ్లింది.