4,700 మంది వలసదారులు మృతి
జెనీవా: బతుకును వెతుకుతూ యూరప్‌కు వలస వెళ్తున్న వారి జీవితాలు మధ్యలోనే మధ్యధరా సముద్రం పాలవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటిరకు యూరప్‌కు వలస వెళ్లడానికి ప్రయత్నించిన 4,700 మంది మధ్యధరా సముద్రంలో మృతి చెందారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐఓఎమ్) తాజాగా వెల్లడించింది. అంతకు ముందు సంవత్సరాలతో పోల్చినప్పుడు యూరప్ వలసదారుల సంఖ్య తగ్గినప్పటికీ.. మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వారి సంఖ్య మాత్రం పెరిగింది.
2015లో నవంబర్ 30 నాటికి మధ్యధరా సముద్రంలో మృతి చెందిన వలసదారుల సంఖ్య 3,565గా ఉంది. ఐఓఎమ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది సముద్రమార్గం గుండా యూరప్ చేరుకున్న వలసదారుల సంఖ్య 8,83,393 గా ఉండగా.. 2016లో ఈ సంఖ్య 3,48,664కు తగ్గింది. అయినప్పటికీ మధ్యధరా సముద్రంలో మృతుల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. పశ్చిమ ఆఫ్రికా నుంచి ఇటలీకి చేరుకునే క్రమంలో ఎక్కువమంది వలసదారులు మృతి చెందినట్లు ఐఓఎమ్ వెల్లడించింది.