గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చర్యలు
మోర్తాడ్: గల్ఫ్ వలస కార్మికులకోసం తెలంగాణలో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ఐఎల్వో), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్(ఐవోఎం) ప్రతినిధులు ముందుకొచ్చారు. వలస కార్మికుల సంక్షేమం కోసం పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్యసమితి అనుబంధ విభాగం ఐఎల్వో దక్షిణాసియా దేశాల ఇన్చార్జి, వలస కార్మికుల వ్యవహారాల నిపుణుడు డినో కోరెల్, సాంకేతిక నిపుణుడు అమిష్ కర్కి ఈనెల 22న హైదరాబాద్‌లో సీఎస్ సోమేష్‌కుమార్, కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డితో సమావేశమయ్యారు.
గల్ఫ్ దేశాల నుంచి సొంత గడ్డకు చేరుకునే వారికి పునరావాసంతో పాటు, కుటుంబం, సమాజంతో వారు మమేకం కావడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వలస కార్మికుల సంక్షేమం కోసం తాము కొన్ని కార్య క్రమాలను చేపట్టనున్నామని, దీనికి తెలంగాణను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నామని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న గల్ఫ్ వలసల వ్యవహారాల విశ్లేషకులు మంద భీంరెడ్డి ఐఎల్వో ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారులకు పలు సూచనలు చేశారు. ఈ ప్రతి పాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే వలస కార్మికుల కుటుంబాలు బాగుపడే అవకా శాలు న్నాయి. తెలంగాణలో పైలట్ ప్రాజెక్టు అమలు చేయా లన్న ఐఎల్వో ప్రతిపాదనలపై గల్ఫ్ వలస కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐఎల్వో ప్రా జెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని వారు కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలి..
ఐఎల్వో ప్రతినిధులు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభు త్వం ఆమోదం తెలపాలి. ఇక్కడ అమలు చేయకపోతే పైలట్ ప్రాజెక్టు మరో రాష్ట్రానికి తరలిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రంలోని వలస కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– చెన్నమనేని శ్రీనివాసరావు, సీఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్, గల్ఫ్ జేఏసీ నాయకులు