
నెత్తుటి జగడంలో 47 మంది హతం
అయలాన్ కుర్దీ చనిపోయాడు. శరణార్థుల సంక్షోభాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చకు పెట్టాడు. కానీ అతని మాతృదేశం సిరియాలో నెత్తుటేర్లు పారిస్తున్నవారికి ఇవేవీ పట్టలేదు. జగడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వ దళాలు.. దాన్ని కూలదోసి గద్దెనేక్కేందుకు ప్రయత్నిస్తున్న తిరుగుబాటు దళాలు.. ఈ రెండింటి నడుమ మొత్తం సిరియానే ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు.. ఇదీ అక్కడి తాజా పరిస్థితి. ఈ క్రమంలోనే శుక్రవారం తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు పక్షాలకు చెందిన మొత్తం 47 మంది హతమయ్యారు. రాజధాని అలెప్పిని ఆనుకుని ఉండే మరియా పట్టణంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.
సైనిక పరంగా అత్యంత కీలక స్థావరంగా భావించే మరియా పట్టణంపై పట్టు కోసం మూడు సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా అందించిన సైనిక శిక్షణలో రాటుదేలిన సిరియా తిరుగుబాటు దళాల చేతిలో ఆ ప్రాంతం ఉంది. దానిని చేజిక్కించుకునేందుకు ఐఎస్ వరుసదాడులు జరుపుతున్నది. శనివారం నాటి రక్తకాండ కూడా అందులో భాగంగా జరిగిందేనని, చనిపోయినవారిలో 27 మంది ఐఎస్ ఉగ్రవాదులుకాగా, 20 మంది తిరుగుబాటు దళాలకు చెందినవారని స్థానిక మీడియా పేర్కొంది.