భారీ వర్షాల ధాటికి జపాన్‌లోని కురషికిలో నీటమునిగిన ఇంటిపైకెక్కి సాయం కోసం ఎదురుచూస్తున్న స్థానికులు
టోక్యో: భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షం కారణంగా శనివారం భారీ వరద పోటెత్తడంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల దెబ్బకు 47 మంది గల్లంతయ్యారు. జపాన్‌లోని ఒకయామా నగరంలో చాలాచోట్ల 16 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు. వీరిలో చాలామంది ఇళ్లపైకి చేరి సహాయక హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు.
హిరోషిమాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలువురు చనిపోయారు. ఎహిమే, క్యోటోల్లోనూ వరద పోటెత్తడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 50.8 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దాదాపు 48,000 మంది పోలీసులు, ఆర్మీ, అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి 8.23 గంటలకు(స్థానిక కాలమానం) టోక్యోకు సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Comments
Please login to add a commentAdd a comment