Hill climbing
-
48 గంటలుగా గుహలో నరకం.. రాజు రెస్క్యూ ఫొటోలు
-
షికారుకెళ్లాడు.. బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు..
రామారెడ్డి (ఎల్లారెడ్డి): అడవిలో షికారుకెళ్లిన ఇద్దరు యువకుల్లో ఒకరు గుట్టల మధ్య ఇరుక్కుపోయిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని సింగరాయపల్లి అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రెడ్డిపేటకు చెందిన చాడ రాజు, మహేశ్‌లు మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో సింగరాయపల్లి అటవీ ప్రాంతంలోకి షికారుకెళ్లారు. ఈ క్రమంలో గుట్టపై పెద్ద బండరాళ్ల మధ్య ఇద్దరూ ఇరుక్కుపోయారు. మహేశ్ ఎట్టకేలకు మంగళవారం పొద్దుపోయాక బయటకు వచ్చాడు. కానీ చాడ రాజు అందులోనే చిక్కుకుపోవడంతో మహేశ్ కూడా రాత్రంతా అక్కడే ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం వరకు రాజుకు మహేశ్ నీళ్లు, ఆహారం తీసుకెళ్లి ఇచ్చాడు. అప్పటికీ అతను బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో గ్రామస్తులకు సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అటవీశాఖ అధికారులు, రెడ్డిపేట, సింగరాయపల్లి గ్రామస్తులు చేరుకొని రాత్రి పొద్దు పోయే వరకు జేసీబీ సహాయంతో రాజును బయటకు తీసేందుకు శ్రమించారు. జేసీబీతో గుట్టలను పక్కకు తీసేందుకు వీలు కాకపోవడంతో లైటింగ్ ఏర్పాటు చేసి కామారెడ్డి నుంచి 210 ఈటాచీ తెప్పించారు. రాజు ఉన్న చోట చార్జింగ్ ఫ్యాన్ ఏర్పాటు చేయడంతో పాటు వైద్యుల సలహాల మేరకు పండ్ల రసాలను అందజేస్తున్నారు. ఈ గుట్టల మధ్య ఉడుములు, కుందేళ్లు ఉంటాయని వీటిని పట్టుకునే క్రమంలోనే గుట్టల మధ్య రాజు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. అడిషనల్ ఎస్పీ అన్యోన్య ఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. జంతువుల కోసం వచ్చినట్లు విచారణలో తేలితే కేసు నమోదు చేస్తామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదీ చదవండి: Hyderabad: బిర్యానీలో ఈగ.. బిర్యానీ హౌజ్‌కు జరిమానా -
కేరళ విలవిల
తిరువనంతపురం: పర్యాటక స్వర్గధామం కేరళ అతలాకుతలమైంది. 9 రోజులుగా నిర్విరామంగా కురుస్తున్న వర్షాలు, వరదలు రాష్ట్రంలో పెను విషాదాన్నే మిగిల్చాయి. వరదల ఉధృతి ఏమాత్రం తగ్గకపోవడంతో పరిస్థితి మరింత నిరాశాజనకంగా మారింది. 24 గంటల వ్యవధిలో 106 మంది ప్రాణాలు కోల్పోవడం వరదల తీవ్రతకు అద్దంపడుతోంది. శుక్రవారం సాయంత్రం మృతుల సంఖ్య 173కు పెరిగింది. మే 29 నుంచి రాష్ట్రంలో వర్ష సంబంధ ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య 324కు చేరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. తాజా వరదల్లో ప్రతి జిల్లాలో మౌలిక వసతులు, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు శతాబ్ద కాలంలో ఇంతటి పెను విపత్తును ఎరుగని కేరళ పర్యాటకం రూపంలో భారీగా నష్టపోయే అవకాశాలున్నాయి. త్రివిధ దళాలు, 51 జాతీయ విపత్తు ఉపశమన బృందాలు సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. అయితే దెబ్బతిన్న రోడ్లు, కొండచరియలు వారి ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తున్నాయి. నదులు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు ప్రమాదకరంగానే ఉన్నాయి. నిరాశ్రయులైన సుమారు 3 లక్షల మంది 2 వేల సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌కు కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు క్రమంగా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా, పాతనమ్‌తిట్టా, ఆలప్పుజా, ఎర్నాకులం, త్రిసూర్ జిల్లాల్లో ప్రకృతి ప్రకోపం కొనసాగుతోంది. శుక్రవారం రాత్రి కొచ్చి చేరుకున్న ప్రధాని మోదీ నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. మరో రెండ్రోజులు భారీ వర్షాలు అలువా, కాలడీ, పెరుంబవూర్, మువాత్తుపుజా, చాలాకుడీ తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు కూడా తమ పడవలతో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన వయానాడ్ జిల్లాకు మిగతా ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. పలు రైలు సేవలను రద్దు లేదా రీషెడ్యూల్ చేయగా, కొచ్చి మెట్రో సేవలు శుక్రవారం యథావిధిగా కొనసాగాయి. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భీకర గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాతనమ్‌తిట్టా, తిరువనంతపురం, కొల్లాం, ఆలపుజ్జా, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కడ్, మలప్పురం, కోజికోడ్ తదితర ప్రాంతాల్లో గంటకు 60 కి.మీ.వేగంతో గాలులు వీచే అవకాశాలున్నట్లు అంచనావేసింది. మరోవైపు, విదేశాల్లో ఉన్న కేరళీయులు తమవారి క్షేమం కోసం పరితపిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న తమ కుటుంబీకులు, బంధువులను ఆదుకోవాలని టీవీల్లో అధికారులకు విజ్ఞప్తిచేస్తున్నారు. ఆరేళ్ల బిడ్డతో వరదల్లో చిక్కుకున్న ఓ మహిళ..‘ఆహారం, నీరు లేదు. సాయం చేయండి..ప్లీజ్’ అని వేడుకుంటున్న వీడియో వాట్సాప్‌లో విస్తృతంగా వ్యాపించింది. ఆసుపత్రులు జలమయం.. రోగులకు అవస్థలు ఎర్నాకులం జిల్లాలోని చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఫలితంగా రోగులను సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కొన్ని ఆసుపత్రుల్లోకి వరద నీరు చేరడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సహాయక శిబిరాల్లోనూ ఆహారం, నీటికి కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడ్డాయి. వరద ప్రభావం ఎక్కువగాలేని తిరువనంతపురం సహా కొన్ని జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయి. తిరువనంతపురం జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూలైన్లలో బారులుతీరారు. 3 వేల లీటర్ల డీజిల్, వేయి లీటర్ల పెట్రోల్‌ను రిజర్వులో ఉంచుకోవాలని అధికారులు అన్ని పెట్రోల్ బంకుల యాజమాన్యాలను సూచించారు. మరోవైపు, పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ దేశీయ విమాన సంస్థలతో సమావేశమై ప్రయాణ చార్జీలు తగ్గించి కేరళకు అదనపు విమానాలను నడపాలని కోరింది. మళ్లీ భేటీ అయిన ఎన్సీఎంసీ.. ఇప్పటి వరకు సుమారు 4 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 44 మందిని కాపాడామని కేరళలో సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్ఎఫ్ ప్రకటించింది. కొండచరియలు విరిగిపడటంతో కొన్ని ప్రాంతాలకు చేరుకోవడం కష్టతరమవుతోందని తెలిపింది. ప్రస్తుతం 51 బృందాలు సేవలందిస్తున్నాయని, మరో రెండు బృందాలు త్వరలోనే అక్కడికి వెళ్తాయని ఢిల్లీలో ఎన్డీఆర్ఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు. జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ(ఎన్సీఎంసీ) వరుసగా రెండోరోజు శుక్రవారం సమావేశమై కేరళలో వరద పరిస్థితిని సమీక్షించింది. ఈ భేటీలో కేరళ, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కూడా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అదనపు వనరులను సమకూర్చుకోవాలని సహాయక చర్యలు చేపడుతున్న దళాలకు కమిటీ సూచించింది. ఇప్పటి వరకు కేంద్రం 339 మోటార్ పడవలు, 2800 లైఫ్ జాకెట్లు, 1400 తేలియాడే బెల్టులు, 27 లైట్ టవర్స్, వేయి రెయిన్కోట్లు పంపించినట్లు ఎన్సీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే లక్ష ఆహార పొట్లాలు పంపిణీచేశామని, మరో లక్ష పొట్లాలు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. పాలపొడిని పంపేందుకు కూడా ఏర్పాట్లుచేశామని వెల్లడించారు. రైల్వే శాఖ 1.20 లక్షల నీటి సీసాలను పంపింది. మరో 1.20లక్షల బాటిళ్లను పంపేందుకు సిద్ధంగా ఉంచింది. సుమారు 3 లక్షల తాగునీటి బాటిళ్లతో ప్రత్యేక రైలు నేడు కాయంకుళం చేరుకోనుంది. కేరళకు 100 మెట్రిక్ టన్నుల ఆహారపదార్థాల పొట్లాలను పంపేందుకు శిశు, సంక్షేమ శాఖ వైమానిక దళం, కేరళ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. ఇంతటి భారీస్థాయి వర్షాలు గతంలో పడిన సంవత్సరం 1924 వరద ముప్పులో ఉన్న జిల్లాలు : 13 రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు : 9 గేట్లు ఎత్తేసిన డ్యాంలు: 27 కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతాలు: 211 ధ్వంసమైన రోడ్లు: 10,000 కి.మీ దెబ్బతిన్న ఇళ్లు: సుమారు 20,000 ఆస్తినష్టం అంచనా: రూ.8316 కోట్లు ఇడుక్కి డ్యాం నుంచి సెకన్‌కు విడుదలవుతోన్న నీరు: 15 లక్షల లీటర్లు వరద సాయానికి కేటాయించిన ఓనం నిధులు: రూ. 30 కోట్లు శుక్రవారం రాష్ట్రంలో కాపాడింది: 80,000 ఆలువాలోనే: 71,000 నిరాశ్రయులు: 3,00,000 సహాయక శిబిరాలు: 2,000 సహాయక బృందాలు: 51 కేంద్రం పంపినవి.. మోటార్ పడవలు: 339 లైఫ్ జాకెట్లు: 2800 లైట్ టవర్స్: 27 రెయిన్కోట్లు: 1000 తేలియాడే బెల్టులు: 1400 ఆహార పొట్లాలు: 1,00,000 రైల్వేశాఖ ఇచ్చిన నీటి సీసాలు: 1,20,000 పాలక్కడ్‌లో కొండచరియలు విరిగిపడిన అనంతరం కొనసాగుతున్న సహాయకచర్యలు ఇంటి పైకప్పు నుంచి సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులు కోజికోడ్‌లో వరదనీటిలో పెట్రోల్ పంప్ -
ఇండోనేసియాలో భారీ భూకంపం
మతరమ్: ఇండోనేసియాలోని లంబోక్ దీవిని ఆదివారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దెబ్బకు లంబోక్‌లో 39 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. తొలుత భారీ తీవ్రతతో, అనంతరం కొంచెం తక్కువ తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటు స్వల్ప భూప్రకంపనలు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రతకు పక్కనే ఉన్న బాలిలోని భవనాలు కంపించాయి. ట్రెక్కింగ్ కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీచేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంప కేంద్రం లంబోక్ భూగర్భంలో 10 కి.మీ లోతున ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. -
జపాన్ వరదల్లో 50 మంది మృతి
టోక్యో: భారీ వర్షాలతో జపాన్ అతలాకుతలం అవుతోంది. కుండపోత వర్షం కారణంగా శనివారం భారీ వరద పోటెత్తడంతో 50 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వరదల దెబ్బకు 47 మంది గల్లంతయ్యారు. జపాన్‌లోని ఒకయామా నగరంలో చాలాచోట్ల 16 అడుగుల ఎత్తులో వరద నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో చిక్కుకున్నారు. వీరిలో చాలామంది ఇళ్లపైకి చేరి సహాయక హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు. హిరోషిమాలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో పలువురు చనిపోయారు. ఎహిమే, క్యోటోల్లోనూ వరద పోటెత్తడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 50.8 లక్షల మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీచేశారు. ప్రస్తుతం దాదాపు 48,000 మంది పోలీసులు, ఆర్మీ, అగ్నిమాపక శాఖ అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శనివారం రాత్రి 8.23 గంటలకు(స్థానిక కాలమానం) టోక్యోకు సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. -
దేశమంతా రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు శుక్రవారం నాటికి దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. పశ్చిమ రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌ను రుతుపవనాలు తాకాయనీ, దేశంలో రుతుపవనాలు చేరుకునే చివరి చోటు ఇదేనని తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు శ్రీగంగానగర్‌ను జూలై 15 నాటికి తాకుతాయనీ, ఈసారి 17 రోజుల ముందుగానే ఆ ప్రాంతానికి చేరుకున్నాయని ఐఎండీ అదనపు డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ చెప్పారు. రుతుపవనాల ప్రభావంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురిశాయన్నారు. ఈ ఏడాది మూడు రోజుల ముందుగానే, మే 29నే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, పశ్చిమ తీర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం తెలిసిందే. అయితే ఇటీవల కొన్ని రోజులపాటు స్తబ్దుగా ఉండిన రుతుపవనాలు మళ్లీ గతవారంలో పుంజుకున్నాయి. గతవారం ముందు వరకు దేశవ్యాప్తంగా సగటున 10 శాతం లోటు వర్షపాతం ఉండగా, శుక్రవారానికి అది ఆరు శాతానికి తగ్గింది. దేశంలో వ్యవసాయానికి అవసరమైన వర్షాల్లో 70 శాతం నైరుతి రుతుపవనాల కాలంలోనే కురుస్తాయి. నైరుతీ రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని లోయర్ సియాంగ్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో నలుగురు ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ) సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వర్షాల ప్రభావంతో కొండపై వదులైన భారీ బండరాయి ఒకటి బసర్–అకజన్ రోడ్డుపై వెళుతున్న ఐటీబీపీ సిబ్బంది మినీబస్సుపై పడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. జమ్మూ–శ్రీనగర్ జాతీయరహదారిపై కొండచరియలు విరిగిపడటంతో రోడ్డు మూసుకుపోయింది. దీంతో అమర్నాథ్ యాత్రకు వెళుతున్న పలువురు భక్తులు బేస్‌క్యాంప్‌లకు తిరిగివెళ్లాల్సి వచ్చింది. అస్సాంలో వరదలకు గురువారం ఒకరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 32కు చేరుకుంది. -
ప్రకృతి ప్రకోపం.. 23 మంది మృతి
తిరువనంతపురం/లక్నో: దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రకోపానికి 23 మంది చనిపోయారు. భారీ వర్షాలు, కొండచరియలు కేరళలో బీభత్సం సృష్టించగా, యూపీలో పెనుగాలులు భారీగా ప్రాణ నష్టం కలిగించాయి. మరోవైపు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర, మణిపూర్, మిజోరాం అతలాకుతలమయ్యాయి. యూపీలో 15 మంది, కేరళలో నలుగురు, ఈశాన్య రాష్ట్రాల్లో నలుగురు మృత్యువాతపడ్డారు. కేరళలో కురుస్తున్నభారీ వర్షాలకు కోజికోడ్ జిల్లా తమరస్సెరి తాలుకాలోని కట్టిపారా గ్రామంలో గురువారం కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు చిన్నారులున్నారు. మరో 10 మంది గల్లంతయ్యారు. దీంతో ఇప్పటి వరకు వర్ష సంబంధ ఘటనల్లో రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 27కు పెరిగిందని ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్ వెల్లడించారు. కోజికోడ్, మలప్పురం, కన్నూర్, వాయనాడ్, కసర్గాడ్ జిల్లాలను వరదలు ముంచెత్తాయి. ఈశాన్యంలో కుండపోత.. గత మూడురోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వరదలు పోటెత్తాయి. నలుగురు మృతి చెందగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు తక్షణమే మరిన్ని మిలిటరీ, ప్రకృతి విపత్తు నిర్వహణ బృందాలను పంపాలని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవదేవ్ విజ్ఞప్తి చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పొరుగు రాష్ట్రమైన మణిపూర్‌లో వరదల కారణంగా రాజధాని ఇంఫాల్, ఇతర ప్రాంతాల్లోని విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థలకు శుక్రవారం వరకూ సెలవు ప్రకటించారు. -
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
-
హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు
న్యూఢిల్లీ: భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధల్లీ ప్రాంతంలో 8 వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ తెలిపారు. ధల్లీ– షోగీ రహదారిపై కొండ చరియలు కుప్పకూలడంతో భారీ సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయన్నారు. ప్రమాదం లో మూడు ఇళ్లు, ఓ గుడి దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నహన్, పొంటా సాహెబ్ పట్టణాల్లో సరా సరి 137 మి.మీ, నైనాదేవీలో 118 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు. మరోవైపు కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు బెంగళూరులోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. గడచిన 12 గంటల్లో బెంగళూరులో 35 మి.మీ. వర్షం కురియడంతో బెగుర్ సరస్సు గట్టు తెగి పోయిందని అధికారులు తెలిపారు. రాబోయే 48 గంటల్లో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురిసే అవ కాశముందని అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్, అస్సాం, బిహార్‌లో వరద ప్రభావంతో కొత్తగా ప్రజ లెవరూ మరణించలేదని తెలిపారు.