బాలిలో భూకంపానికి ధ్వంసమైన వాహనాలు
మతరమ్: ఇండోనేసియాలోని లంబోక్ దీవిని ఆదివారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దెబ్బకు లంబోక్‌లో 39 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. తొలుత భారీ తీవ్రతతో, అనంతరం కొంచెం తక్కువ తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటు స్వల్ప భూప్రకంపనలు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రతకు పక్కనే ఉన్న బాలిలోని భవనాలు కంపించాయి. ట్రెక్కింగ్ కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి.
రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీచేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంప కేంద్రం లంబోక్ భూగర్భంలో 10 కి.మీ లోతున ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.
Comments
Please login to add a commentAdd a comment