వాఘా సరిహద్దులో నెత్తుటేర్లు | 55 killed, over 200 wounded in suicide blast near Wagah border | Sakshi
Sakshi News home page

వాఘా సరిహద్దులో నెత్తుటేర్లు

Published Mon, Nov 3 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

వాఘా సరిహద్దులో నెత్తుటేర్లు

వాఘా సరిహద్దులో నెత్తుటేర్లు

లాహోర్‌లో ఆత్మాహుతి దాడి..  
55 మంది పాకిస్థానీల దుర్మరణం
200 మందికి గాయాలు
సైనిక విన్యాసాలు పూర్తయిన అనంతరం పేలుడు
 
 లాహోర్: పాకిస్థాన్ మళ్లీ నెత్తురోడింది. లాహోర్‌లోని వాఘా సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన శక్తివంతమైన ఆత్మాహుతి దాడిలో 55 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో చిన్నారులతో పాటు 11 మంది మహిళలు, ముగ్గురు భద్రతా సిబ్బంది  ఉన్నారు. 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పది మందికిపైగా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భారత-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఆదివారం సాయంత్రం పతాక అవనతం పూర్తయిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించింది. దీంతో ఆ ప్రదేశమంతా మరుభూమిని తలపించింది.  మృతదేహాలు.. గాయపడిన వారి ఆర్తనాదాలతో భయానకంగా కనిపించింది.
 
 పేలుడు దాటికి సమీపంలోని భవనాలు, షాపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వెంటనే పాక్ సైనికులు ఘటనా స్థలాన్ని  అధీనంలోకి తీసుకున్నారు. సహాయక సిబ్బంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పేలుడు తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. తొలుత దీనిని సిలిండర్ పేలుడుగా భావించినా.. ఆ తర్వాత ఆత్మాహుతి దాడి అని నిర్ధారించారు. కాగా అల్ కాయిదా అనుబంధ సంస్థ జుందల్లా, మరో ఉగ్రవాద సంస్థ జమాత్ అహ్రార్ దాడికి బాధ్యత ప్రకటించుకున్నాయి.
 
 కాగా.. వజీరిస్థాన్‌లో మిలిటరీ ఆపరేషన్లకు ప్రతిగా ఈ దాడికి పాల్పడ్డామని పాక్ తాలిబన్లు పేర్కొన్నారు. పాక్‌లోని లాహోర్ - మనదేశంలోని అమృత్‌సర్‌కు మధ్య సరిహద్దు దాటడానికి ఉన్న ఏకైక రోడ్డు మార్గం వాఘా సరిహద్దే. అయితే ప్రతిరోజు సాయంత్రం పతాక అవనత కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఇరు దేశాల సైనిక విన్యాసాలతో సరిహద్దును మూసేస్తారు. ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రతి రోజు వేలాది మంది సందర్శకులు తరలి వస్తుంటారు. అయితే పరేడ్ ఏరియా నుంచి సందర్శకులు తిరిగి వెళుతుండగా.. ఎగ్జిట్ గేటు వద్దకు వచ్చిన 20 ఏళ్ల ఆత్మాహుతిదళ సభ్యుడు తనను తాను పేల్చుకున్నాడని పంజాబ్ పోలీస్ ఐజీ ముస్తాక్ సుఖేరా చెప్పారు. తమ బృందాలు ఆత్మాహుతి దాడి జరిగినట్టు ధ్రువీకరించాయన్నారు. సూసైడ్ బాంబర్‌ను గేటు వద్దే భద్రతా సిబ్బంది గుర్తించారని, అయితే అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో జనం ఉండటంతో  పేల్చుకున్నాడని చెప్పారు. 25 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించినట్టు భావిస్తున్నామన్నారు. మొహర్రం నేపథ్యంలో షియాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు  దాడులకు పాల్పడే అవకాశముండడంతో అన్ని భద్రతా చర్యలూ తీసుకున్నామన్నారు. దాడిపై పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
 
 హైఅలర్ట్ ప్రకటించిన బీఎస్‌ఎఫ్..
 
 న్యూఢిల్లీ: వాఘా వద్ద ఆత్మాహుతి దాడి నేపథ్యంలో అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్.. పంజాబ్‌లోని ఇండో-పాక్ సరిహద్దు వెంబడి హైఅలర్ట్ ప్రకటించింది. సోమవారం నుంచి మూడు రోజులు సరిహద్దుల వద్ద సైనిక విన్యాసాలను రద్దు చేసినట్టు బీఎస్‌ఎఫ్ చీఫ్ డీకే పాఠక్ చెప్పారు. ఫిరోజ్‌పూర్‌లో దాడులకు పాల్పడే అవకాశం ఉందని కొద్దిరోజుల క్రితమే నిఘా వర్గాలు హెచ్చరించాయని, ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసినట్టు చెప్పారు.

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement