కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: 8 మంది మృతి
Published Mon, Jun 5 2017 5:01 PM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM
బీజింగ్: చైనాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. షాన్‌డోంగ్ ప్రావిన్సులో ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. లిన్‌గాంగ్ ఎకనమిక్ జోన్‌లోని ఓ రసాయన కర్మాగారంలో ఆదివారం రాత్రి పనులు జరుగుతున్న సమయంలో గ్యాస్ ట్యాంకర్ పేలింది. పేలుడుతో మంటలు అంటుకుని 8 మంది కార్మికులు అక్కడికక్కడే అగ్నికి ఆహుతయ్యారు. మంటలు చెలరేగి చుట్టుపక్కల ఉన్న ఆయిల్ ట్యాంకర్లకు అంటుకున్నాయి.
వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అక్కడున్న కార్మికులతో పాటు చుటుపక్కల వారిని వెంటనే ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. దాదాపు 900 మంది అగ్నిమాపక సిబ్బంది శ్రమించి సోమవారం మధ్యాహ్నానికి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement