సాక్షి : ఉగ్రవాదాన్ని పెంచి పోసిస్తోంది మీరు కాదా? అంటూ ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పాకిస్థాన్‌ను నిలదీసిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతి విమర్శలు చేయబోయి ప్రపంచ దేశాల ముందు పాక్ పరువు కూడా పొగొట్టుకుంది. అయితే సుష్మా ప్రసంగంలో తమ దేశ ప్రస్తావన కూడా రావటంపై చైనాకు మండిపోయింది. మిత్ర దేశం పాక్‌కు గట్టి మద్ధతు ప్రకటిస్తూ మరోపక్క భారత్ పై తీవ్ర విమర్శలు గుప్పించింది.
సుష్మా ప్రసంగం మొత్తం దురహంకారంగా ఉందంటూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం తన సంపాదకీయంలో ప్రచురించింది. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదం విస్తరించి ఉండొచ్చు. కానీ, ఏ దేశం కూడా దానిని ఒక విధానంగా అంగీకరించబోదు. ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం ద్వారా పాక్ సాధించేంది ఏంటి? డబ్బా గౌరవమా?. పొరుగుదేశాలతో సజావుగా సాగిపోతున్న సంబంధాలను, వాణిజ్య ఒప్పందాలను గత కొంత కాలంగా భారత్ తనకు తానుగా దెబ్బ తీసుకుంటోంది. మతపరమైన వైరంతోనే పాక్ పైన ఇలాంటి విమర్శలు గుప్పిస్తోంది’ అంటూ తెలిపింది.
చైనా, పాక్‌లతో వైషమ్యాలు మాని ఇకనైనా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తే మంచిదని సూచించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై నిషేధం విధించాలని ఐరాసలో భారత ప్రతిపాదనను పదే పదే భద్రతామండలి సభ్య దేశం చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో భారత మీడియా చైనాపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తోందని గ్లోబల్ టైమ్స్ చెప్పింది. అదే సమయంలో డోక్లామ్ వ్యవహారంలో భారత్‌దే ముమ్మాటికీ తప్పని ఆ కథనం ప్రస్తావించింది.