ఓ బామ్మ.. 80 మంది మనుమలు..
ఈ బామ్మ పేరు మేరీ సోలే.. వయసు 82 ఏళ్లు. ఈమెకు ఆరుగురు కుమార్తెలు, నలుగురు కుమారులతోపాటు 33 మంది మనుమలు, 44 మంది ముని మనుమలు, ముగ్గురు మహా మునిమనుమలు ఉన్నారు. అంటే.. మొత్తం 80 మంది మనుమలు! త్వరలో మరో ముగ్గురు మహా మునిమనుమలు రాబోతున్నారు.
ఇంగ్లండ్‌లోని సౌత్‌యార్క్‌షైర్‌లో భర్త రేమండ్‌తో కలిసి ఉంటున్న ఈమె.. ఇప్పుడు తన మనుమలు, మనుమరాళ్ల కోసం క్రిస్మస్ బహుమతులు కొనే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. ఆమే స్వయంగా షాపింగ్‌కు వెళ్లి, మనుమల వయసుకు తగ్గ బహుమతులు కొని తీసుకురావడమే కాకుండా వాటిని తానే గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నారు.
ఈ క్రిస్మస్ రోజున ఈమె కుటుంబం మొత్తం కలిసి వేడుక చేసుకోనుంది. అన్నట్టు.. తన కుటుంబంలో చిట్ట చివరి మహా మునిమనువడి పేరుతో సహా అందరి పేర్లూ సోలేకు గుర్తే! ఈ వయసులో కూడా ఇలా అందరి పేర్లూ గుర్తుకుపెట్టుకోవడం ఆషామాషీ విషయం కాదని, తల్లితో పోలిస్తే ఈ విషయంలో తనకు జ్ఞాపకశక్తి చాలా తక్కువని సోలే పెద్ద కుమారుడు స్టీఫెన్ గ్రెగరీ (60) చెబుతున్నారు. ఈ బామ్మ గ్రేట్ కదూ!