'ఏ తల్లీ చేయకూడని దౌర్భాగ్యపు పని చేసింది'
వాషింగ్టన్: ప్రపంచంలో ఏ తల్లి కూడా చేయకూడని దౌర్భాగ్యపు పనిని అమెరికాలో ఓ తల్లి చేసింది. అమ్మతనానికే మచ్చ తెచ్చేలా వ్యవహరించి మాతృత్వం అనే మాటకు అర్థం లేకుండా చేసింది. పసివయసు కూడా దాటని తన ఆరేళ్ల కూతురును చెరిచేయండి అంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడమే కాకుండా, ఆరేళ్ల కూతురుపైనే అత్యాచారం చేయించి చివరకు కటకటాల పాలైంది. కోర్టు ఆమెకు 26 ఏళ్ల జైలు శిక్షను విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని వాషింగ్టన్కు చెందిన ఓ 35 ఏళ్ల తల్లి డబ్బు చెల్లించేవారు ఎవరైనా తన కూతురుని అనుభవించేందుకు రావొచ్చని ఆన్ లైన్లో ప్రకటనలు చేసింది.
అంతేకాకుండా కూతురుపై దారుణంగా అత్యాచారం చేయించి ఫొటోలు, వీడియోలు తీయించింది. ఈ విషయం చివరకు పోలీసులకు తెలిసి ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించగా పలు విస్మయకరమైన వాస్తవాలు వెలుగు చూశాయి. ఎన్నో అభ్యంతరకరమైన ఫొటోలు, వీడియోలు, ఆ బాలికపై లైంగిక దాడి జరుగుతుండగా ఆమె పక్కనే ఉండి చూస్తున్నట్లుగా ఉన్న వీడియోలకు సంబంధించిన ఫుటేజీలు సొంతం చేసుకున్నారు.
అనంతరం ఆ మహిళను జైలుకు తరలించి విచారించగా ఆమె ఇలాంటి దారుణాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదని, గతంలో 12 లైంగిక నేరాలకు పాల్పడిందని, చిన్నపిల్లలపై లైంగిక దాడులు చేయించిందని తెలిసింది. అయితే, కొన్ని ఇబ్బందుల దృష్ట్యా ఈ దారుణాలకు ఒడిగట్టిన ఆమె పేరు మాత్రం కోర్టు బయటకు చెప్పొద్దని ఆదేశించింది. అలా చెప్పడం వల్ల ఆ బాలిక ఎవరో సమాజానికి తెలిసిపోతుందని, చిన్నారి మనుగడకు ఇబ్బంది అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఆమె భర్తకు కూడా ఇలాంటి నేరాల కింద 27 ఏళ్లపాటు జైలు శిక్ష పడింది.