ఈ గ్రహంపై 80 వేల ఏళ్లకు ఒక ఏడాది..!
భూమి సూర్యుడి చుట్టూ తిరగడానికి మన కాలమానం ప్రకారం ఏడాది పడుతుంది. కానీ మీనరాశిలో ఉన్న ఈ గ్రహానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా? 80 వేల ఏళ్లు! అవును.. భూమికి, సూర్యుడికి మధ్య దూరంతో పోలిస్తే ఇది తన నక్షత్రానికి రెండు వేల రె ట్ల దూరంలోని కక్ష్యలో తిరుగుతోందట. మనకు 155 కాంతి సంవత్సరాల దూరంలో.. మీనరాశిలోని జీయూ పీఎస్‌సీ అనే నక్షత్రం చుట్టూ తిరుగుతున్న ఈ అధిగ్రహం పేరు జీయూ పీఎస్‌సీ బీ.
గురుగ్రహం కన్నా పది రెట్లు పెద్దగా, వాయువులతో నిండి ఉన్న ఈ గ్రహాన్ని యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియెల్ పీహెచ్‌డీ విద్యార్థి మారీ-ఈవ్ నాడ్ నేతృత్వంలోని బృందం కనుగొంది. వివిధ దేశాల్లోని వేధశాలల ద్వారా పరిశోధించిన వీరు మీనరాశిలో మొత్తం 90 యువ నక్షత్రాలను పరిశీలించగా.. ఈ ఒక్క గ్రహమే దొరికిందట. నక్షత్రానికి చాలా దూరంలో తిరుగుతున్నందున దీనిపై రకరకాల పరిశోధనలకు వీలు కానుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.