
‘ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్’
తమ దేశానికి భారత ప్రధాని రావడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.
జెరూసలెం: తమ దేశానికి భారత ప్రధాని రావడం ఇదే మొదటిసారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. భారత ప్రధాని రాక కోసం 70 ఏళ్లు ఎదురు చూస్తున్నామని చెప్పారు. మూడు రోజుల పర్యటన కోసం తమ దేశానికి విచ్చేసిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వయంగా ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ‘ఆప్ కా స్వాగత్ హై మేరా దోస్త్’ అంటూ హిందీలో మోదీకి ఆహ్వానం పలికారు. భారత దేశం అంటే తమకెంతో ఇష్టమని.. ఇండియా సంప్రదాయాలు, చరిత్ర, ప్రజాస్వామ్యం, ప్రగతి పట్ల అంకితభావం తామెంతో గౌరవిస్తామని చెప్పారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం విజయవంతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇరు దేశాల స్నేహ సంబంధాలకు ఆకాశమే హద్దు అని వ్యాఖ్యానించారు. మేకిన్ ఇండియాకు సహకరిస్తామని హామీయిచ్చారు.
భారత్ ప్రధానిగా ఇక్కడకు రావడం గర్వంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు. సవాళ్లను ఇజ్రాయెల్ అవకాశాలుగా మార్చుకుందని, తమకు వ్యుహాత్మక భాగస్వామి మాత్రమే కాదు, స్ఫూర్తి అని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య స్నేహం మరింత బలపడాలని, ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కొవాలని ఆకాంక్షించారు.