అబార్షన్లకు పెరిగిన డిమాండ్!
లాటిన్ అమెరికా దేశాలలో ప్రస్తుతం అబార్షన్లకు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. దీనంతటికీ కారణం.. ఆ ప్రాంతాల్లో విపరీతంగా విస్తరిస్తున్న జికా వైరస్ భయం. ప్రధానంగా బ్రెజిల్ లాంటి దేశాలలో అబార్షన్లు చేయాలంటూ ముందుకొచ్చే మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో రెట్టింపు అయిందట. ఇతర దేశాలలో కూడా అబార్షన్ల సంఖ్య బాగా పెరిగిందని వైద్యులు అంటున్నారు. ఈ వైరస్ కారణంగా పుట్టే పిల్లల మెదడు చాలా చిన్నగా ఉంటుందని, దాన్ని మైక్రోసెఫాలీ అంటారని.. అందువల్ల ఇప్పట్లో గర్భం దాల్చొద్దని చాలా ప్రభుత్వాలు మహిళలకు సలహాలు ఇచ్చాయి.
దాంతో, ఆస్పత్రులలో అబార్షన్లతో పాటు అబార్షన్ అయ్యేందుకు ఉపయోగపడే మాత్రలను సరఫరా చేసే ఆన్లైన్ స్టోర్లకు కూడా తాకిడి పెరిగింది. 2015 నవంబర్ 17వ తేదీన అమెరికా ఆరోగ్య సంస్థ తొలిసారిగా జికా వైరస్ గురించిన హెచ్చరిక జారీచేసింది. ఆ తర్వాతి నుంచి బ్రెజిల్, ఈక్వెడార్ దేశాలలో గర్భిణులు అబార్షన్లవైపు ఎక్కువగా మొగ్గుచూపారు. కానీ ఇప్పటికీ చాలావరకు లాటిన్ అమెరికా దేశాలలో అబార్షన్లు చట్టవిరుద్ధం. దాంతో చాలామంది అనధికారికంగానే చేయించుకుంటున్నారు.