బీహార్‌లో బాంబు పేలుడు
ఓ మహిళ, కానిస్టేబుల్ మృతి
ఆరా/పట్నా: బిహార్‌లోని ఆరా పట్టణంలో ఉన్న కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతిచెందారు. కొందరు న్యాయవాదులు సహా 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళతోపాటు కానిస్టేబుల్ ఉన్నాడు. ఈ మహిళే మానవబాంబుగా మారి పేల్చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖైదీలు పారిపోవడానికి ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు.
పోలీసు వ్యాన్ నుంచి విచారణ ఖైదీలను కోర్టులోకి తీసుకువెళుతుండగా పేలుడు జరిగిందని తెలిపారు. మానవ బాంబుగా భావిస్తున్న మహిళ మృతదేహంలో బాంబు శకలాలు ఉన్నాయన్నారు. పేలుడు హడావుడి మాటున ఇద్దరు విచారణ ఖైదీలు తప్పించుకున్నారు. ఇందులో ఒకడైన లంబూ శర్మ 2009లో ఇదే విధంగా తప్పించుకున్నాడు.