Court area
-
‘విడాకులు ఇవ్వలేను సార్’.. కోర్టు నుంచి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
విడాకులివ్వడం ఇష్టం లేని ఓ వ్యక్తి.. భార్యను ఎత్తుకొని కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ విచిత్ర ఘటన చైనాలో జరిగింది. లీకి, చెన్కి 20 ఏళ్ల కిందట పెళ్లయ్యింది. వారికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అయితే తాగొచ్చిన భార్యను లీ హింసిస్తున్నాడు. ఎంత చెప్పినా వినకపోవడం, భర్తలో ఎంతకీ మార్పు రాకపోవడంతో విడాకుల కోసం భార్య చెన్ కోర్టును ఆశ్రయించారు. గృహ హింస కింద కేసు పెట్టిన ఆమె విడాకులు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే పిల్లల పోషణ బాధ్యతల దృష్ట్యా సయోధ్య సాధ్యమని భావించిన కోర్టు తొలుత విడాకులకు నిరాకరించింది. అయినా భర్త మారకపోవడంతో చెన్ మళ్లీ కోర్టును ఆశ్రయించారువిచారణకు వచ్చిన భార్యను ఎత్తుకుని కోర్టు హాల్ నుంచి లీ పారిపోయాడు. కోర్టు న్యాయాధికారులు వెంటనే జోక్యం చేసుకుని లీని మందలించారు. దీంతో లీ సెప్టెంబర్ 2న రెండో తేదీన కోర్టుకు లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాడు. మళ్లీ అలాంటి తప్పు చేయబోనని ప్రతిజ్ఞ చేశాడు. ‘విడాకులు ఇస్తున్నారని పొరపడ్డా. అందుకే ఆందోళనకు గురై భార్యను ఎత్తుకెళ్లా’’అని క్షమాపణ పత్రంలో రాశారు. ఎక్కడ దూరమైపోతుందోనని భర్త పడ్డ ఆవేదన చూసి భార్య మనసు కాస్తంత కరిగింది. ఇకనైనా మారతాడేమో చూద్దామని ఆయనకు మరో అవకాశం వచి్చంది. దీంతో ఈ జంటకు విడాకులు మంజూరుకాలేదు. మరోవైపు చైనాలో గృహ హింస పెద్ద సమస్యగా ఉంది. ఆల్–చైనా ఉమెన్స్ ఫెడరేషన్ ప్రకారం వివాహిత మహిళల్లో 30 శాతం గృహ హింసను ఎదుర్కొంటున్నారు. 60శాతం మంది మహిళల ఆత్మహత్యలకు గృహ హింసే కారణం. ‘జడ్జీలు, పోలీసుల ముందే కోర్టు నుంచి ఎత్తుకెళ్లిన వ్యక్తి.. ఒంటరిగా ఉన్నపుడు భార్యను ఎంతైనా హింసిస్తాడు’అని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కోర్టులో కేజ్రీవాల్.. సీఎంతో ఏసీపీ అనుచిత ప్రవర్తన?
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరుస్తున్న వేళ కేజ్రీవాల్‌తో ఓ పోలీసు అధికారి అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది. దీంతో, కేజ్రీవాల్ సదరు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం.. లిక్కర్ స్కాం కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను శుక్రవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్బంగా పటిష్ట పోలీసు భద్రత మధ్య కేజ్రీవాల్‌ను కోర్టుకు తీసుకువచ్చారు. కాగా, తనను ఈడీ ఆఫీసు నుంచి కోర్టుకు తీసుకువచ్చే క్రమంలో ఢిల్లీ ఏసీపీ ఏకే సింగ్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని కేజ్రీవాల్ ఆరోపించారు. అవసరం లేకున్నా ఏక్ సింగ్ అత్యుత్సహం ప్రదర్శించి తనను ఇబ్బందులకు గురిచేసినట్టు కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఏకే సింగ్‌ను తన సెక్యూరిటీ నుంచి తొలగించాలని రౌస్ అవెన్యూ కోర్టుకు దరఖాస్తు అందజేశారు. ఇదిలా ఉండగా.. గతంలో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించడం విశేషం. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కూడా ఏకే సింగ్ ఇలాగే ప్రవర్తించారు. లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను కోర్టులో హాజరుపరుస్తున్న క్రమంలో ఏకే సింగ్.. సిసోడియా మెడ పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో, ఈ ఘటన అప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు.. లిక్కర్ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు కోర్టు ఈడీ కస్టడీ విధించింది. ఈ కేసులో భాగంగా కేజ్రీవాల్‌ను ఈడీ.. ఆరు రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించనుంది. ఇక, లిక్కర్ స్కాం కేసు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. దీంతో, వీరిద్దరిని కలిపి ఈడీ విచారించే అవకాశం ఉంది. -
గ‘లీజు’ గురివింద!
సాక్షి, విశాఖపట్నం : పచ్చకామెర్ల బాధితులకు లోకమంతా పచ్చగా కనిపిస్తుంది! అద్దె స్థలానికి ఎసరు పెట్టిన గురివిందకు.. అనుమతులున్న స్థలాలు అక్రమమే అనిపిస్తాయి! బంధువుల భూమినే కాజేసిన భూ రాబందుకు..సొంత భూమిలో ఎవరు నిర్మాణాలు చేపడుతున్నా గిట్టదు! అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసినట్లుగా.. తనను అక్కున చేర్చుకొని ఆదరించిన విశాఖపై బురద చల్లుతున్న ఈనాడు రామోజీ నగరానికి ముఖ్యమంత్రి వస్తున్నారంటే చాలు ఉలిక్కిపడి విషం చిమ్ముతున్నారు. ఇన్నాళ్లూ రుషికొండపై నానా యాగీ చేసిన ఈనాడు ఇప్పుడు అక్కడ భవనాలు ప్రారంభం కావడంతో మరో బురద జల్లుడు కార్యక్రమానికి తెగబడింది. అన్ని అనుమతులూ తీసుకుని ఓ దిగ్గజ సంస్థ సొంత భూమిలో నిర్మాణాలు చేపడుతుంటే అదేదో నేరమన్నట్లుగా దిగజారుడు కథనాలను ప్రచురించింది. విశాఖ తీరానికి తూట్లు పొడుస్తున్నారంటూ రామోజీ శోకాలు పెట్టారు. విశాఖలో లక్షల ఎకరాల భూ రికార్డులను మాయం చేసిన చరిత్ర టీడీపీదే. కోర్టు పరిధిలో ఉన్న వివాదాస్పద భూముల్లో పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకున్న ఘనత చంద్రబాబుదే. వాస్తవానికి భీమిలిలో కొంత భూమిని కొనుగోలు చేసిన దిగ్గజ సంస్థ అరబిందో సీఆర్‌జెడ్ నిబంధనలకు లోబడి అన్ని అనుమతులూ తీసుకొని నిర్మాణ పనులు ప్రారంభించింది. ఈనాడుకు మాత్రం అది దేశద్రోహంలా కనిపిస్తోంది. సంతకాలు ఫోర్జరీ.. పచ్చళ్లు అమ్ముకుంటూ వచ్చిన రామోజీని విశాఖ నగరం అక్కున చేర్చుకుంది. అయితే ఆయన తన వ్యాపార విస్తరణకు సహకరించిన నగరాన్నే మింగేసే వైట్ కాలర్ క్రిమినల్‌గా మారిపోయారు! కుటుంబ సభ్యుల్ని మోసగించిన వ్యక్తిగా... బంధువుల్ని కోర్టుల చుట్టూ తిప్పి వారి భూముల్ని కొల్లగొట్టిన వ్యాపారిగా.. పత్రికను అడ్డం పెట్టుకొని కుళ్లు రాజకీయాలకు మూలపురుషుడుగా రామోజీ మిగిలిపోయారు. విశాఖలో కబ్జాలకు, గలీజు దందాలకు ఆద్యుడిగా నిలిచారు. 1974లో విశాఖలోని సీతమ్మధారలో 2.78 ఎకరాల భూమిని, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 10 భవనాలను నెలకు రూ.3 వేలు అద్దె చొప్పున 33 ఏళ్ల లీజుకు మంతెన ఆదిత్యవర్మ నుంచి లీజుకు తీసుకున్న రామోజీ గడువు ముగిసినా ఖాళీ చేయకుండా తిరిగి కోర్టులో కేసు వేశారు. స్థలం యజమానికి తెలియకుండా కొంత భూమిని రోడ్డు విస్తరణకు అప్పగించి ప్రతిఫలంగా ప్రభుత్వం నుంచి కొంత స్థలాన్ని పొందారు. రామోజీ దాన్ని తన కుమారుడి పేరిట రిజిస్టర్ చేయించుకున్నారు. లీజు స్థలాన్ని తన సొంతమని పేర్కొంటూ ప్రభుత్వానికి అప్పగించటం.. ప్రతిఫలంగా పొందిన స్థలాన్ని రామోజీ రిజిస్టర్ చేసుకుని మోసపూరితంగా వ్యవహరించడంతో యజమాని మంతెన ఆదిత్యవర్మ క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీన్నుంచి తప్పించుకునేందుకు రామోజీ ఏకంగా విశాఖ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్‌ను ఫోర్జరీ చేయడం గమనార్హం. ఫోర్జరీకి సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నట్లు తేలడంతో న్యాయస్థానం రామోజీపై కేసు నమోదుకు ఆదేశించగా స్టే తెచ్చుకున్నారు. దిగువ కోర్టు నుంచి అత్యున్నత న్యాయస్థానం వరకూ ఫోర్జరీకి సంబంధించి రామోజీకి చీవాట్లు పెట్టడంతో బిల్డింగ్ కొట్టేద్దామన్న ప్రయత్నాలు విఫలమై గత్యంతరం లేక ఆ స్థలాన్ని యజమానికి అప్పగించారు. కబ్జా ‘కార్యాలయం’ కనిపించలేదా? దసపల్లా భూముల వ్యవహారం కోర్టులో ఉండగానే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అందులో కొంత భాగాన్ని టీడీపీ కార్యాలయం నిర్మించేందుకు కేటాయించుకున్నారు. నగరం నడిబొడ్డున సర్వే నం 1196లో 2 వేల గజాల్ని కారుచౌకగా అప్పగించేశారు. ఇది చాలదన్నట్లుగా పక్కన ఉన్న కొండని సైతం తొలిచేసి 100 నుంచి 300 గజాల్ని ఆక్రమించేసి భవనాన్ని నిర్మించుకుంటే రామోజీ కళ్లు మూసుకున్నారు. మరోవైపు ఇల్లు నిర్మించుకునేందుకు ఓ వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని ఆక్రమించిన నాటి మంత్రి గంటా శ్రీనివాసరావు అక్కడ తన కలల సౌధాన్ని కట్టుకున్నారు. ఆ కబ్జా కాండ బయటకు రాకుండా రామోజీ అడ్డుపడ్డారు. దీన్ని సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడి భూ యజమానితో బేరసారాలకు దిగారు. విద్యాలయం పేరుతో విధ్వంసం.. టీడీపీ నేత, మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకొని రెండు ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినా టీడీపీ సర్కారు పట్టించుకోలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్శిటీ కాంపౌండ్ వాల్‌ను తొలగించి కబ్జాలో ఉన్న 40.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. విలువైన ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తుంటే విశ్వవిద్యాలయాన్ని నాశనం చేస్తున్నారంటూ నాడు రామోజీ బురద చల్లేందుకు ప్రయత్నించారు. -
‘సుప్రీం’ కాంప్లెక్స్‌లోకి సందర్శకులకు నో
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం మరిన్ని తీవ్ర నిర్ణయాలు తీసుకుంది. న్యాయస్థానం ఆవరణలోకి ప్రతి శనివారం సందర్శకులకు బృందాలుగా ఇచ్చే అనుమతులను రద్దు చేసింది. కోర్టు క్యాంటీన్, కెఫేలను మూసివేయాలని ఆదివారం ఆదేశించింది. ఈ నెల 16వ తేదీన మొత్తం 15 ధర్మాసనాలకు గాను 6 మాత్రమే పనిచేస్తాయని, 12 అత్యవసర కేసులను మాత్రమే విచారిస్తాయని ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ‘çకోర్టు ఆవరణలోకి సాధారణ సందర్శకులను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలి. లాయర్లు, కోర్టు సిబ్బంది, చిరు వ్యాపారులు ప్రతి రోజూ సాయంత్రం 5.30 గంటలకల్లా ఆవరణ విడిచి బయటకు వెళ్లిపోవాలి. 6 గంటలకల్లా కోర్టులోని విశ్రాంతి గదులు, కారిడార్లు, మెట్లు తదితరాలను శుభ్రం చేయాలి. లాయర్లు, కక్షిదారులు, గుమాస్తాలు ఆవరణలో గుమి కూడరాదని, విధులు ముగిసిన తక్షణమే వెళ్లిపోవాలి’అని ఆదేశించింది. -
కోర్టులో అలజడి
విశాఖ లీగల్/ విశాఖ క్రైం: అది విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణం.. కక్షిదారులతో రద్దీగా ఉంది.. గంజాయి కేసులో ఆరుగురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇంతలో కలకలం.. జడ్జి సమక్షంలో అందరూ చూస్తుండగానే.. శిక్ష పడిన ఓ ముద్దాయి గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అలజడి రేగింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటనకు పాల్పడ్డ రాజాన అప్పలనాయుడు (35)ను తరలించడానికి వెంటనే ఫోన్ చేసినా 108 అంబులెన్స్ రాకపోవడంతో చివరకు ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు. మాకవరపాలెం మండలంలో గంజాయి తరలిస్తుండగా 2016లో ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురికి న్యాయమూర్తి ఎస్.నాగార్జున 14 ఏళ్ల జైలు శిక్ష , రూ.లక్ష వంతున జరిమాన విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఎన్ జయలక్ష్మి అందించిన వివరాలు.. రోలుగుంట మండలానికి చెందిన రాజాన అప్పలనాయుడు, కర్రి నీలాంబరం (తాజంగిగ్రామం), ఎం.రామకృష్ణ (ఎంకే పట్నం), కె.చంద్రరావు (చటంజిపురం), కృష్ణ (వంట్లమామిడి–ఎంకేపురం) హెచ్.రాజశేఖర్ (కాకినాడ) 2016, అక్టోబర్ 30వ తేదీన 292 కేజీల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. కొత్తకోట సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు. రక్షణపై నీలినీడలు నిత్యం వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో న్యాయమూర్తి తీర్పు చెప్పేటప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులు, కానిస్టేబుళ్లు నిందితుల పక్కనే ఉండాలి. నిందితులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తీర్పు నిందితునికి అనుకూలంగా వస్తే అక్కడే వదిలిపెడతారు.లేని పక్షంలో వారెంట్‌తో ఆర్మ్డ్ రిజర్వు పోలీసు/కేంద్ర కారాగారానికి అప్పగిస్తారు. అయితే సోమవారం జరిగిన సంఘటన ఇందుకు భిన్నంగా కనిపించింది. నిందితుడు కోర్టు హాల్లోకి కత్తితో వెళ్లినా కనీసం తెలుసుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు అనుమానంగా మారింది. ఈ సంఘటనపై న్యాయమూర్తి, ఇతర న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని న్యాయవాదులు కోరారు. నిందితులు కోర్టుహాల్లోకి వచ్చే సమయాల్లో బయట పూర్తిగా తనికీ చేసి మాత్రమే అనుమతించాలని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సామాన్యులకు సైతం శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది. స్వల్ప వివాదాల్లో హడావుడి చేసే పోలీసులు కీలకమైన కేసుల్లో పక్కన లేకపోవడం, కోర్టు హాలుకి వెళ్లేముందు వారిని తనికీ చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కేజీహెచ్‌లో చికిత్స పాతపోస్టాఫీసు: కోర్టులో ఆత్మహత్యాయత్నం చేసిన అప్పలనాయుడుకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణులు వెంటనే ప్రథమ చికిత్స చేసి అత్యవసర వైద్య విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అత్యవసర విభాగం వైద్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు గొంతు కోసుకున్న రాజాన అప్పలనాయుడు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువచ్చారని, రోగి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య నిపుణుల బృందం ప్రథమ చికిత్స చేసి శస్త్రచికిత్స కొరకు థియేటర్‌కు తరలించారని తెలిపారు. పట్టుబడిన గంజాయి ప్యాకెట్లు, నిందితులతో పోలీసులు (ఫైల్) ఎందుకు కోసుకున్నాడో తెలీదు నా తమ్ముడు అప్పలనాయుడు ఎందుకు గొంతు కోసుకున్నాడో తెలీడం లేదు. గంజాయి కేసులో వాయిదాలకు విశాఖ కోర్టుకు వస్తున్నాడు. ఈరోజు ఫైనల్ హియరింగ్ అని, శిక్ష వేస్తారని కాని మాకు తెలీదు. ఇరవై రోజులుగా నేను విజయనగరంలో కూలి పని చేస్తున్నాను. విషయం తెలుసుకుని కేజీహెచ్‌కు వచ్చాను. ఏడాది క్రితమే వివాహం చేశాం. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఇలా చేయడం అందరినీ కలచివేసింది. భగవంతుడే నా తమ్ముడ్ని కాపాడాలి.–రాజాన రాంబాబు, నిందితుడి అన్న అప్పలనాయుడిపై మూడు గంజాయి కేసులు గంజాయి రవాణా కేసులో శిక్షపడ్డ ముద్దాయి రాజన అప్పలనాయుడిపై గతంలో మూడు కేసులున్నాయి. విశాఖ జిల్లా కొత్తకోట సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2016లో గంజాయి కేసులో న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన సమయంలో ఒక్కసారిగా జేబులోంచి తీసిన పేపర్ కటింగ్ చేసే కత్తితో కంఠం కోసుకున్నాడు. గంజాయి కేసులో మొత్తం ఆరుగురికి 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. అప్పలనాయుడిపై 2015లోని రోలు గుంటలో ఒక కేసు నమోదు చేశారు. 2016లో మాకవరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులో నమోదు చేశారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు కొత్తకోట పోలీసులు తెలిపారు. పట్టుబడింది మాకవరపాలెంలోనే.. మాకవరపాలెం, రోలుగుంట: ఆత్మహత్యాయత్నం చేసుకున్న రాజాన అప్పలనాయుడు కారులో గంజాయి తరలిస్తూ మాకవరపాలెం మండలంలోనే పట్టుబడ్డాడు. 2016లో కారులో గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో మాకవరపాలెం పోలీసులు బూరుగుపాలెం రహదారిలో సోదాలు చేపట్టారు. అదే మార్గంలో వస్తున్న కారును పైడిపాల వద్ద ఆపి తనిఖీ చేయడంతో కారులో 74 ప్యాకెట్లలో ఉన్న రూ.7 లక్షల విలువైన 148 కేజీల గంజాయిని పట్టుబడింది. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజా యిని తరలిస్తున్న విజయవాడకు చెందిన పి.ప్రశాంత్‌కుమార్, ఎస్.కిరణ్కుమార్తోపా టు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం గ్రా మానికి చెందిన రాజాన అప్పలనాయుడుల ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని కోర్టుకు అప్పగించడంతో విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరిని సోమవారం విశాఖలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు తరలించగా మెజిస్ట్రేట్ నిందితులకు 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. దీంతో నిందుతుల్లో ఒకడైన రాజాన అప్పలనాయుడు కత్తితో గొంతు కోసుకోవడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
కోర్టు ప్రాంగణంలోనే భార్యను చంపిన భర్త
గౌహతి: అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో శుక్రవారం దారుణం చోటు చేసుకుంది. కన్నకూతురిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి కోర్టు ప్రాంగణంలోనే తన భార్యను గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. నిందితుడు పూర్ణ నహర్ కన్నకూతురును అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 9 నెలలు జైళ్లో గడిపి ఇటీవలే బెయిల్‌పై బయటికి వచ్చాడు. విచారణ నిమిత్తం శుక్రవారం కోర్టుకు హాజరైన అతను అకస్మాత్తుగా భార్య రీటా నహర్పై దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
బీహార్‌లో బాంబు పేలుడు
ఓ మహిళ, కానిస్టేబుల్ మృతి ఆరా/పట్నా: బిహార్‌లోని ఆరా పట్టణంలో ఉన్న కోర్టు ప్రాంగణంలో శుక్రవారం జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మృతిచెందారు. కొందరు న్యాయవాదులు సహా 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ మహిళతోపాటు కానిస్టేబుల్ ఉన్నాడు. ఈ మహిళే మానవబాంబుగా మారి పేల్చేసుకుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖైదీలు పారిపోవడానికి ఆమె ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసు వ్యాన్ నుంచి విచారణ ఖైదీలను కోర్టులోకి తీసుకువెళుతుండగా పేలుడు జరిగిందని తెలిపారు. మానవ బాంబుగా భావిస్తున్న మహిళ మృతదేహంలో బాంబు శకలాలు ఉన్నాయన్నారు. పేలుడు హడావుడి మాటున ఇద్దరు విచారణ ఖైదీలు తప్పించుకున్నారు. ఇందులో ఒకడైన లంబూ శర్మ 2009లో ఇదే విధంగా తప్పించుకున్నాడు.