విశాఖ లీగల్/ విశాఖ క్రైం: అది విశాఖ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణం.. కక్షిదారులతో రద్దీగా ఉంది.. గంజాయి కేసులో ఆరుగురికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ఇంతలో కలకలం.. జడ్జి సమక్షంలో అందరూ చూస్తుండగానే.. శిక్ష పడిన ఓ ముద్దాయి గొంతుకోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో అలజడి రేగింది. ఈ హఠాత్పరిణామంతో అక్కడున్నవారంతా నిశ్చేష్టులయ్యారు. ఈ ఘటనకు పాల్పడ్డ రాజాన అప్పలనాయుడు (35)ను తరలించడానికి వెంటనే ఫోన్ చేసినా 108 అంబులెన్స్ రాకపోవడంతో చివరకు ఆటోలో కేజీహెచ్‌కు తరలించారు. మాకవరపాలెం మండలంలో గంజాయి తరలిస్తుండగా 2016లో ఎనిమిదిమందిని అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురికి న్యాయమూర్తి ఎస్.నాగార్జున 14 ఏళ్ల జైలు శిక్ష , రూ.లక్ష వంతున జరిమాన విధిస్తూ సోమవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీఎన్ జయలక్ష్మి అందించిన వివరాలు.. రోలుగుంట మండలానికి చెందిన రాజాన అప్పలనాయుడు, కర్రి నీలాంబరం (తాజంగిగ్రామం), ఎం.రామకృష్ణ (ఎంకే పట్నం), కె.చంద్రరావు (చటంజిపురం), కృష్ణ (వంట్లమామిడి–ఎంకేపురం) హెచ్.రాజశేఖర్ (కాకినాడ) 2016, అక్టోబర్ 30వ తేదీన 292 కేజీల గంజాయి రవాణా చేస్తుండగా పట్టుబడ్డారు. కొత్తకోట సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పు చెప్పారు.
రక్షణపై నీలినీడలు
నిత్యం వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో న్యాయమూర్తి తీర్పు చెప్పేటప్పుడు సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారులు, కానిస్టేబుళ్లు నిందితుల పక్కనే ఉండాలి. నిందితులను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలి. తీర్పు నిందితునికి అనుకూలంగా వస్తే అక్కడే వదిలిపెడతారు.లేని పక్షంలో వారెంట్‌తో ఆర్మ్‌డ్ రిజర్వు పోలీసు/కేంద్ర కారాగారానికి అప్పగిస్తారు. అయితే సోమవారం జరిగిన సంఘటన ఇందుకు భిన్నంగా కనిపించింది. నిందితుడు కోర్టు హాల్లోకి కత్తితో వెళ్లినా కనీసం తెలుసుకోకుండా వ్యవహరిస్తున్న పోలీసుల తీరు అనుమానంగా మారింది. ఈ సంఘటనపై న్యాయమూర్తి, ఇతర న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని న్యాయవాదులు కోరారు. నిందితులు కోర్టుహాల్లోకి వచ్చే సమయాల్లో బయట పూర్తిగా తనికీ చేసి మాత్రమే అనుమతించాలని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సామాన్యులకు సైతం శాంతి భద్రతలు ప్రశ్నార్థకంగా మారే అవకాశముంది. స్వల్ప వివాదాల్లో హడావుడి చేసే పోలీసులు కీలకమైన కేసుల్లో పక్కన లేకపోవడం, కోర్టు హాలుకి వెళ్లేముందు వారిని తనికీ చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు.
కేజీహెచ్‌లో చికిత్స
పాతపోస్టాఫీసు: కోర్టులో ఆత్మహత్యాయత్నం చేసిన అప్పలనాయుడుకు కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. వైద్య నిపుణులు వెంటనే ప్రథమ చికిత్స చేసి అత్యవసర వైద్య విభాగంలోని ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు. అత్యవసర విభాగం వైద్యాధికారి డాక్టర్ సురేంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు గొంతు కోసుకున్న రాజాన అప్పలనాయుడు అనే వ్యక్తిని ఆస్పత్రికి తీసుకువచ్చారని, రోగి పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య నిపుణుల బృందం ప్రథమ చికిత్స చేసి శస్త్రచికిత్స కొరకు థియేటర్‌కు తరలించారని తెలిపారు.
పట్టుబడిన గంజాయి ప్యాకెట్లు, నిందితులతో పోలీసులు (ఫైల్)
ఎందుకు కోసుకున్నాడో తెలీదు
నా తమ్ముడు అప్పలనాయుడు ఎందుకు గొంతు కోసుకున్నాడో తెలీడం లేదు. గంజాయి కేసులో వాయిదాలకు విశాఖ కోర్టుకు వస్తున్నాడు. ఈరోజు ఫైనల్ హియరింగ్ అని, శిక్ష వేస్తారని కాని మాకు తెలీదు. ఇరవై రోజులుగా నేను విజయనగరంలో కూలి పని చేస్తున్నాను. విషయం తెలుసుకుని కేజీహెచ్‌కు వచ్చాను. ఏడాది క్రితమే వివాహం చేశాం. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో ఇలా చేయడం అందరినీ కలచివేసింది. భగవంతుడే నా తమ్ముడ్ని కాపాడాలి.–రాజాన రాంబాబు, నిందితుడి అన్న
అప్పలనాయుడిపై మూడు గంజాయి కేసులు
గంజాయి రవాణా కేసులో శిక్షపడ్డ ముద్దాయి రాజన అప్పలనాయుడిపై గతంలో మూడు కేసులున్నాయి. విశాఖ జిల్లా కొత్తకోట సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 2016లో గంజాయి కేసులో న్యాయమూర్తి తీర్పు ఇచ్చిన సమయంలో ఒక్కసారిగా జేబులోంచి తీసిన పేపర్ కటింగ్ చేసే కత్తితో కంఠం కోసుకున్నాడు. గంజాయి కేసులో మొత్తం ఆరుగురికి 14 ఏళ్లు జైలు శిక్ష పడింది. అప్పలనాయుడిపై 2015లోని రోలు గుంటలో ఒక కేసు నమోదు చేశారు. 2016లో మాకవరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసులో నమోదు చేశారు. మొత్తం మూడు కేసులు నమోదు చేసినట్లు కొత్తకోట పోలీసులు తెలిపారు.
పట్టుబడింది మాకవరపాలెంలోనే..
మాకవరపాలెం, రోలుగుంట: ఆత్మహత్యాయత్నం చేసుకున్న రాజాన అప్పలనాయుడు కారులో గంజాయి తరలిస్తూ మాకవరపాలెం మండలంలోనే పట్టుబడ్డాడు. 2016లో కారులో గంజాయి తరలిస్తున్నట్టు అందిన సమాచారంతో మాకవరపాలెం పోలీసులు బూరుగుపాలెం రహదారిలో సోదాలు చేపట్టారు. అదే మార్గంలో వస్తున్న కారును పైడిపాల వద్ద ఆపి తనిఖీ చేయడంతో కారులో 74 ప్యాకెట్లలో ఉన్న రూ.7 లక్షల విలువైన 148 కేజీల గంజాయిని పట్టుబడింది. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజా యిని తరలిస్తున్న విజయవాడకు చెందిన పి.ప్రశాంత్‌కుమార్, ఎస్.కిరణ్‌కుమార్‌తోపా టు రోలుగుంట మండలం ఎం.కె.పట్నం గ్రా మానికి చెందిన రాజాన అప్పలనాయుడుల ను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారయ్యారు. పట్టుబడిన వారిని కోర్టుకు అప్పగించడంతో విశాఖ సెంట్రల్ జైలులో ఉన్నారు.
ఈ నేపథ్యంలో వీరిని సోమవారం విశాఖలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుకు తరలించగా మెజిస్ట్రేట్ నిందితులకు 14 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.లక్ష చొప్పున జరిమానా విధించారు. దీంతో నిందుతుల్లో ఒకడైన రాజాన అప్పలనాయుడు కత్తితో గొంతు కోసుకోవడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
Comments
Please login to add a commentAdd a comment