పాకిస్తాన్ కు ఏడీబీ ఝలక్
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో సింధు నదిపై పాకిస్తాన్ రూ. 1,400 కోట్లతో నిర్మించాలనుకున్న రిజర్వాయర్‌కు నిధులివ్వడానికి ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్(ఏడీబీ) నిరాకరించింది. రెండేళ్ల కిందట ఈ ప్రాజెక్టుకు ప్రపంచబ్యాంకు కూడా నిధులివ్వడానికి ఒప్పుకోలేదు. భారత్ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకురావాలని అప్పట్లో ప్రపంచబ్యాంకు కోరగా.. అందుకు పాకిస్తాన్ నిరాకరించడంతో ఆ బ్యాంకు కూడా నిధులివ్వడానికి ముందుకురాలేదు.
తాజాగా ఏడీబీ అధ్యక్షుడు టకిహికో నకావో పాక్ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. ‘ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. దీనిపై మేము ఎలాంటి హామీ ఇవ్వలేదు’ అని తెలిపారు. సెంట్రల్ ఏసియన్ రీజినల్ ఎకనమిక్ కో ఆపరేషన్(సీఏఆర్‌ఈసీ) ప్రోగ్రామ్ 15వ మంత్రిత్వ సమావేశం ముగింపు సందర్భంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్‌దార్‌తో సమయుక్త విలేకరుల సమావేశంలో టకిహికో ఈ వ్యాఖ్యలు చేశారు.
పీవోకేలోని గిల్గిట్, బాల్తిస్తాన్ పరిధిలో సాగునీరు, విద్యుత్ అవసరాలకు ఈ ప్రాజెక్టు ఎంతో అవసరమని, దీనికి మరిన్ని భాగస్వామ్యాలు అవసరమని టకిహికో పిలుపునిచ్చారు. పెద్ద ప్రాజెక్టు అయినందువల్లే ఏడీబీ ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదని, భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులో ఏడీబీ పాలుపంచుకునే అవకాశం ఉందని పాకిస్తాన్ లోని డాన్ పత్రిక పేర్కొంది.