అఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి
కాబూల్: అఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ నెత్తుటేర్లు పారాయి. పక్తికా రాష్ట్రంలోని మారుమూల పట్టణం ఉర్గున్‌లో మంగళవారం రద్దీ మార్కెట్, మసీదు వద్ద ఓ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో పలువురు పిల్లలు, మహిళలు సహా 89 మంది అమాయక ప్రజలు మృత్యువాత పడ్డారు. మరో 42 మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు పిల్లలు, మహిళలు ఉన్నారు.
తూర్పు అఫ్ఘాన్‌లో పాక్ సరిహద్దుకు దగ్గరున్న ఈ పట్టణంలో మానవ బాంబర్ జనంతో రద్దీగా మార్కెట్‌లోకి పేలుడు పదార్థాలు నింపిన కారును నడుపుకుంటూ వెళ్తూ ఆ వాహనాన్ని పేల్చేసుకున్నాడు. రంజాన్ పండుగ కోసం సరుకులు కొనుక్కోవడానికి జనం పెద్ద సంఖ్యలో మార్కెట్‌కు రావడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. పేలుడు ధాటికి 20 దుకాణాలు, పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ దారుణానికి పాల్పడింది తాము కాదని తాలిబన్లు పేర్కొన్నారు.