
'ఉత్తర కొరియాకు కళ్లెం వేస్తారా? లేదా?'
న్యూయార్క్ : ఉత్తర కొరియా తాజాగా ఖండాంతర అణుక్షిపణి పరీక్ష చేయడంపై అమెరికా అగ్గిమీద గుగ్గిలం అయింది. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని, సహనంతో వ్యవహరించాలంటూ తమకు హితబోద చేసిన చైనా, రష్యాలను నేరుగా నిలదీసింది. ఉత్తర కొరియా దూకుడుకు కళ్లెం వేస్తారా ? లేదా ? అని నిలదీసింది. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఉత్తర కొరియాపై నేరుగా చర్యలకు దిగాలంటూ ఆ రెండు దేశాలకు అమెరికా సూచించింది. జపాన్ మీదుగా ఉత్తర కొరియా తాజాగా ఖండాంతర అణుక్షిపణి పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.
'ఉత్తర కొరియాకు చైనానే పెద్ద మొత్తంలో ఇందనాన్ని సరఫరా చేస్తోంది. ఆ దేశ శ్రామికులకు ఎక్కువగా జీవనోపాది కల్పిస్తున్న దేశం రష్‌యా. చైనా, రష్యా తప్పనిసరిగా తమ అసహనమేమిటో ఉత్తర కొరియాకు చూపించాలి. నిర్లక్ష్యంగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న ఉత్తర కొరియాపై వారే నేరుగా చర్యలు తీసుకోవాలి' అపి అమెరికా సహాయ కార్యదర్శి రెక్స్ టిల్లర్ సన్ ఒక మీడియా ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగడం ద్వారా ఉత్తర కొరియా మరింత ఆర్ధిక పరంగా, దౌత్యపరంగా ఒంటరిగా మిగలడం తప్ప ఏమీ జరగదని హెచ్చిరించారు. అయితే, దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఉత్తర కొరియా పరీక్షల విషయంలో ట్రంప్ ముందునుంచే తీవ్ర ఆగ్రహం చూపించే విషయం తెలిసిందే.