కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నష్టాలతో కుదేలైన ఎయిర్‌ఫ్రాన్స్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించనుంది. ఎయిర్ ఫ్రాన్స్ , దాని ప్రాంతీయ అనుబంధ సంస్థ హాప్ సంయుక్తంగా 7,500 ఉద్యోగ కోతలను శుక్రవారం ప్రకటించాయి.
కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోవడం, భవిష్యత్తులో విమాన ప్రయాణ అవకాశాలపై నీలి నీడలు కమ్ముకోవడంతో సంక్షోభంలో పడిన సంస‍్థ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఫ్రాన్స్ 6500 మందిని, హాప్‌లో వెయ్యిమందిని తొలగించనున్నామని వెల్లడించాయి. ఎయిర్ ఫ్రాన్స్‌లో మొత్తం 41వేలమంది ఉద్యోగులుండగా, హాప్‌లో 2400మంది పనిచేస్తున్నారు. కరోనా సంక్షోభంతో మూడు నెలల్లో తమ ట్రాఫిక్ 95 శాతం పడిపోయిందని, దీంతో రోజుకు 15 మిలియన్ యూరోల నష్టం వచ్చిందని ఎయిర్ ఫ్రాన్స్ ప్రకటించింది. 2024 వరకు కోలుకునే ఆశలు కూడా లేవని తెలిపింది.
ఉద్యోగాల కోతపై యూనియన్లు ఆందోళనకు దిగాయి. సిబ్బంది ప్రతినిధులతో చర్చల అనంతరం 2022 నాటికి ఈ తొలగింపులు ఉంటాయని యాజమాన్యం శుక్రవారం రాత్రి ప్రకటించింది. కోవిడ్-19 ఒక సాకు మాత్రమేనని ఆందోళనకారుడు, హాప్ ఉద్యోగి జూలియన్ లెమరీ మండిపడ్డారు. కార్మికుల ఉపాధిని దెబ్బతీయడానికి బదులు, సంస్థ పునర్నిర్మాణం, బెయిల్ అవుట్ ప్యాకేజీపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment