ఇస్లామాబాద్: పాకిస్తాన్ అల్ ఖైదా అగ్రనేతను మట్టుబెట్టింది. దేశంలోని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ కు చెందిన ముఖ్యనేత నవాజ్ అలియాస్ హఫీజ్ అబ్దుల్ మతీన్ ను సైనిక బలాలు కాల్చి చంపాయి. మరో ఏడుగురు అనుచరులు కూడా ఈ పోరులో హతమయ్యారు. దేశం యొక్క తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని ఒక ప్రధాన జిల్లాలోని నది ఒడ్డున అనుమానిత తీవ్రవాదులు తలదాచుకున్న శిబిరంపై భద్రతాబలగాలు గురువారం అర్ధరాత్రి దాడి చేశాయి. దీంతో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య హోరా హోరీ పోరు నెలకొంది.దీంతో మతీన్ , మరో ఏడుగురు ఉగ్రవాదులను సైన్యం ఖతం చేసింది.
ప్రముఖ యూనివర్శిటీపై దాడిచేసేందుకు పథక రచనలో భాగంగా ఉగ్రవాదులు సమావేశమయ్యారని జిన్హువా వెల్లడించింది. నిఘావర్గాల సమాచారంతో , వీరి శిబిరంపై దాడిచేసి ఉగ్రవాదులను కాల్చి చంపాయి. టెర్రరిస్టుల మృతదేహాలను పోస్ట్ మార్టం నిర్వహించిన అనంతరం మతీన్ మృతిని ధృవీకరించినట్టు తెలిపింది. వీరిలో 2009లో తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లోని పరేడ్ లేన్ బాంబుదాడి ఘటనలో 36 మంది మరణించిన కేసులో, సీనియర్ సైనిక అధికారిని హత్య చేసిన కేసులో నిందితుడైన అల్ ఖైదా కమాండర్ డేరా ఇస్మాయల్ ఖాన్ కూడా ఉన్నాడు. ఈ పరిణామంతో అల్ ఖైదా ప్రతీకార దాడులకు దిగొచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలను టార్గెట్ గా ఎంచుకోవచ్చనే అంచనా లతో హై అలర్ట్ జారీ చేసింది. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.