పేలుళ్లకు కొన్ని నిమిషాల ముందు..
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్ పేలుళ్ల ఘటనతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడి భారతీయుల క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటోంది. వారికి సంబంధించిన సమాచారంపై ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలో జెట్ ఎయిర్ వేస్ కు చెందిన సిబ్బంది ఒకరు గాయపడ్డారని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ట్విట్ చేశారు. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన భారతీయ మహిళా ఉద్యోగి గాయపడ్డారని, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సుష్మ తెలిపారు. అయితే ఇద్దరు మహిళా సిబ్బంది గాయపడ్డారని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది.
మరోవైపు పేలుళ్ళ కారణంగా ముంబై నుంచి బ్రస్సెల్స్ వెళ్లే అన్ని విమాన సర్వీసులు రద్దయ్యాయి. జెట్ ఎయిర్ వేస్ కూడా తన విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బ్రస్సెల్స్ నుంచి ఢిల్లీ, ముంబై , టొరంటో తదితర నగరాలకు మార్చి 22 వరకు సర్వీసులను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. తమ సిబ్బంది, ఇతర ప్రయాణికుల యోగక్షేమాలను విచారిస్తున్నామని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపింది.
పేలుళ్లకు కొద్ది నిమిషాల ముందే న్యూఢిల్లీ, ముంబై నుంచి జెట్ ఎయిర్ వేస్ కు చెందిన రెండు విమానాలు బ్రస్సెల్స్ చేరుకున్నాయి. బాంబు పేలుళ్ల ఘటనలో ఈ విమాన ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. ఈ పేలుళ్ల నేపథ్యంలో దేశంలో అన్ని విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్ లలో హై ఎలర్ట్ ప్రకటించారు. విస్తృత తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.