
ఎన్నికల పోలింగ్ (ఫైల్ ఫొటో)
అమెరికాలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) మొరాయిస్తున్నాయి. కాలం చెల్లిన ఈవీఎంలతో ఓటర్లు సతమతమౌతున్నారు. ఈ యంత్రాల స్థానంలో కొత్తవి, అధునాతనమైనవి సమకూర్చుకోకపోతే ఎన్నికల ప్రక్రియ అపహాస్యం పాలవుతుందన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. అనేక రాష్ట్రాల, స్థానిక ఎన్నికల అధికారులు నిధుల కొరత కారణంగా కట్టుదిట్టంగా పనిచేసే ఓటింగ్ యంత్రాలును సమకూర్చుకోలేకపోతున్నారని అమెరికా ఎన్నికల భద్రతపై అధ్యయనం చేసిన మీడియా సంస్థ ప్రొపబ్లికాకు చెందిన కేట్ రాబినోవిజ్ తెలిపారు. ఇంతటి ప్రధాన సమస్యను సరిగా పట్టించుకోపోతే భవిష్యత్తులో ఎన్నికల నిర్వహణకు పెను సవాళ్లు ఎదురవుతాయని కూడా ఆమె హెచ్చరిస్తున్నారు.
2017 నవంబర్లో జరిగిన న్యూజెర్సీ గవర్నర్ ఎన్నికల్లో అలెన్‌టౌన్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఉదయం ఆరుగంటలకు వచ్చిన పోలింగ్ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. అక్కడి నాలగు ఈవీఎంలూ పనిచేయలేదు. వాటి స్థానంలో ఏర్పాటుకు నాలుగు గంటల తర్వాత తీసుకొచ్చిన ఓటింగ్ యంత్రాలు సైతం పనిచేయడానికి మొరాయించాయి. చివరికి బ్యాలెట్ పత్రాలతో వారు పోలింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. ఇండియాలో మాదిరిగానే ఏటా ఎన్నో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అమెరికాలో కూడా ఈవీఎంలు మొండికేయడం సర్వసాధారణమైంది. ఎన్నికల ఏర్పాట్లకు నిధులు సమకూర్చే రాష్ట్రాలు, కౌంటీలు కొత్త ఓటింగ్ యంత్రాల కొనుగోలుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు.
2016 ఎన్నికల్లో మూడింట రెండు వంతుల కౌంటీల్లో పదేళ్లు దాటిన ఈవీఎంలనే ఉపయోగించారు. అత్యధిక ప్రాంతాల్లో ఈ యంత్రాలనే 2018 నవంబర్ ఎన్నికల్లో వినియోగిస్తారు. తమ ప్రాంతాల్లోని ఓటింగ్ పరికరాల స్థానంలో 2020 నాటికి కొత్తవి సమకూర్చాలని 33 రాష్ట్రాల ఎన్నికల అధికారులు చెప్పారు. బాగా పాతబడిన ఈవీఎంలు పదేపదే ‘కుప్పకూలిపోవడం’తో అమెరికన్లకు ఎన్నికల వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లే ప్రమాదముందని వారు భయపడుతున్నారు.
పనిచేసేది పదేళ్లే
నేటి ఓటింగ్ యంత్రాలు పదేళ్లు పనిచేసేవేగాని, 70 ఏళ్లు ఉపయోగపడేవి కావని అమెరికా ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ కమిషనర్ మ్యాట్ మాస్టర్సన్ చెప్పారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు రాక ముందు వాడిన లీవర్మిషన్లు, పంచ్కార్డులు కొన్ని దశాబ్దాలపాటు వినియోగానికి అనువుగా ఉండేవి. ఇప్పటి ఈవీఎంల టెక్నాలజీ చాలా త్వరగా పాతబడిపోతుంది. ఒకేసారి పెద్ద సంఖ్యలో ఓటింగ్ యంత్రాలు పనికిరాకుండా పోయే స్థితికి చేరడానికి కారణాలు లేకపోలేదు. 2000 అధ్యక్ష ఎన్నికల్లో ఫ్లారిడా ఓట్ల లెక్కింపు వివాదం ఫలితంగా 2002లో హెల్ప్ అమెరికా ఓట్ చట్టం(హావా) చేశారు.
దీని ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ మొదటిసారి స్థాపించారు. అప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో మాత్రమే నడిచే ఎన్నికల యంత్రాంగానికి ఈవీఎంల తయారీకి ఫెడరల్ సర్కారు నుంచి సాయం లభించింది. ఈ డబ్బుతోనే 2008లో ప్రస్తుత ఓటింగ్ యంత్రాలు తయారు చేశారు. మళ్లీ ఫెడరల్ ప్రభుత్వం మొన్నటి వరకూ నిధులు సమకూర్చకపోవడంతో ఈ యంత్రాలు అవసాన దశకు చేరుకున్నాయి. కాంగ్రెస్ మంజూరు చేసిన తాజా నిధులతో పాత యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటుకు అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment