
ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టారు!
► బార్సిలోనాలోని కాంబ్రిల్స్‌లో మరో ఉగ్రదాడి
► రెండు ఘటనల్లో 14 మంది మృతి.. 100 మందికి గాయాలు
బార్సిలోనా: స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉగ్ర ఘటన జరిగిన కొద్ది గంటల్లోపే సమీపంలోని కాంబ్రిల్స్ అనే సముద్ర తీర నగరంలోనూ ఉగ్రవాదులు దాడి చేశారు. బార్సిలోనా లాగే.. కాంబ్రిల్స్‌లోనూ వాహనంతో పర్యాటకులను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన జరిగిన కాసేపటికే ఈ దాడులకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. వారి వద్దనుంచి విస్ఫోటక పదార్థాలతో ఉన్న బెల్టులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కాల్పుల్లో చనిపోయిన ఐదుగురే బార్సిలోనాలోనూ దాడికి పాల్పడ్డారని ప్రాథమికంగా నిర్థారించారు.
కాగా, ఈ దాడులకు పాల్పడింది తమ సైనికులేనని ఐసిస్ ప్రకటించింది. ఈ రెండు ఉగ్ర ఘటనల్లో 14 మంది మృతిచెందగా 100 మందికి గాయాలయ్యాయి. లాస్ రాంబ్లాస్ వద్ద వ్యాన్‌తో దాడికి పాల్పడిన ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. వ్యాన్ డ్రైవర్ ఇంకా పరారీలోనే ఉన్నాడని పేర్కొన్నారు. మరింత మంది ఈ ఘటనలకు సాయం చేసుంటారనే అనుమానంతో ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేశారు. ఈ ఉగ్ర ఘటనల బాధితుల్లో 18 దేశాలకు (ఫ్రాన్స్, వెనిజులా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, పెరూ, అల్జీరియా, చైనా సహా పలుదేశాలు) చెందిన పర్యాటకులున్నట్లు స్పెయిన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనను ప్రధాని నరేంద్ర మోదీ సహా వివిధ దేశాధినేతలు ఖండించారు. కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాటం చేయాలన్నారు.