కరోనా లక్షణాలు తీవ్రంగా ఉండి.. ఐసీయూలో ఉన్న రోగుల ప్రాణాలను రక్షించేందుకు వైద్యులు ఓ వినూత్న పద్ధతిని గుర్తించారు. వెల్లకిలా కాకుండా బోర్లా పడుకోబెట్టడం ద్వారా రోగులకు మెరుగైన స్థాయిలో ఆక్సిజన్ అందుతున్నట్లు గుర్తించారు. ఈ పద్ధతి ద్వారా తాము విలువైన ప్రాణాలనెన్నో నిలబెట్టినట్లు న్యూయార్క్‌లోని నార్త్‌వెల్ హెల్త్ ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ విభాగాధిపతి మంగళ నరసింహన్ చెబుతున్నారు. ‘ఇది చాలా చిన్నపనే. కానీ రోగుల పరిస్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది’ అని ఆమె తెలిపారు. బోర్లా పడుకోబెట్టడం వల్ల రోగికి అవసరమైన ఆక్సిజన్ తగినంత ఊపిరితిత్తుల్లోకి చేరుతోందని, లాంగ్ ఐలండ్ జ్యూయిష్ ఆసుపత్రిలో ఒక రోగి రక్తంలోని ఆక్సిజన్ సాచురేషన్ 85 నుంచి 98 వరకు పెరిగిందని సీఎన్‌ఎన్ టెలివిజన్ ఒక కథనంలో తెలిపింది. ‘బోర్లా పడుకోబెడితే ఊపిరితిత్తుల్లోని కొన్ని భాగాలు తెరుచుకుంటున్నాయి. మామూలుగానైతే ఇవి మూసుకుపోయి ఉంటాయి’ అని మసాచూసెట్స్ జనరల్ ఆసుపత్రికి చెందిన కాథరీన్ హిబ్బర్ట్ తెలిపారు.
బోర్లా పడుకోబెట్టడం మంచిదే!
2013లో న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ఈ ప్రక్రియకు సంబంధించి ఒక అధ్యయనం ప్రచురితమైంది. ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉన్న రోగులను బోర్లా పడుకోబెట్టినప్పుడు ప్రాణగండం తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. అయితే ఈ అధ్యయనంలో వెంటిలేటర్లపై ఉన్న వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. గత నెల చైనాలోని వూహాన్‌లో జరిగిన మరో అధ్యయనం కూడా ఇలా బోర్లా పడుకోబెట్టడం అనేది కొంతమందికి బాగా ఉపయోగపడిందని తేల్చింది. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిలో ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో ఇది తెలుపుతోందని సౌత్ ఈస్ట్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్ హైబో క్యూ తెలిపారు. వెంటిలేటర్ అవసరమైన రోగుల్లో కొందరు ఈ పద్ధతికి స్పందిస్తారని తెలుస్తోందని క్యూ చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఈ పద్ధతిని అందరికీ ఉపయోగించవచ్చా? లేదా? అనేది పూర్తిగా స్పష్టం కావడం లేదు. తగినన్ని పరీక్షలు జరగకపోవడమే దీనికి కారణం.
Comments
Please login to add a commentAdd a comment