ప్రతీకాత్మక చిత్రం
తమ పిల్లలు తమ కంటే ఆర్థికంగా ఉన్నత స్థానంలో నిలుస్తారని 66శాతం మంది భారతీయులు గట్టిగా నమ్ముతున్నారు.1990 నుంచి భారత దేశపు తలసరి స్థూల జాతీయ ఉత్పత్తి 266 శాతం పెరగడం, 20 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు సగటు భారతీయుడి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం వంటి అంశాల నేపథ్యంలో పిల్లలు భవిష్యత్తులో తమ కంటే ఆర్థికంగా మెరుగైన స్థితి సాధిస్తారని మూడింట రెండు వంతుల మంది పెద్దలు విశ్వసిస్తున్నారు. ప్రముఖ అమెరికా మేథో సంస్థ ‘ప్యూ రీసెర్చ్ సెంటర్’ జరిపిన తాజా సర్వేలో ఈ విషయం వెల్లడయింది.‘ స్ప్రింగ్ 2018 గ్లోబల్ ఆటిట్యూడ్ సర్వే’ పేరుతో ప్యూ సంస్థ భారత్ సహా 27 దేశాల్లో వివిధ అంశాలపై ప్రజల అభ్రిపాయం సేకరించింది. మన దేశంలో ఈ ఏడాది మే 23 జులై 23 మధ్య 2,521 మంది పెద్దలను ఇంటర్వ్యూ చేసింది.
ఆర్థిక స్థితి బాగుంది
దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితి బాగుందని 56 శాతం మంది అభ్రిపాయపడ్డారు.2017లో ఇదే అభిప్రాయం వ్యక్తం చేసిన వారు 83శాతం మంది. అంటే ఆర్థిక స్థితిపై సంతృప్తి వ్యక్తం చేసిన వారి శాతం ఏడాదిలో గణనీయంగా తగ్గిపోయింది. ప్యూ సంస్థ సర్వే చేసిన 27 దేశాల్లో ఎక్కడా ఇంత ఎక్కువ (27శాతం)తగ్గుదల కనిపించలేదు. మోదీ సర్కారు ఎన్నికలకు వెళుతున్న సంవత్సరంలో ఆర్థిక స్థితిపై ప్రజలకు నమ్మకం తగ్గడం గమనార్హం.తమ సర్వేలో భారత్ సహా 20 దేశాల్లో పాలక పార్టీకి మద్దతుదారులైన వారే ఆర్థిక స్థితి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని,దీనిని బట్టి ఆర్థిక వ్యవహారాలను కూడా రాజకీయ కోణంలో ఎలా చూస్తున్నారన్నది తెలుస్తోందని గ్లోబల్ ఎకనమిక్ ఆటిట్యూడ్స్ డైరెక్టర్ బ్రూస్ స్టాక్స్ నివేదికలో పేర్కొన్నారు. భారత దేశంలో అధికార పార్టీకి మద్దతిస్తున్న వారిలో 72 శాతం ఆర్థిక పరిస్థితి బాగుందని చెప్పారు.
ఆర్థిక సమస్యల నేపథ్యంలో...
రూపాయి మారకం విలువ ఈ ఏడాది 11శాతానికిపైగా తగ్గిపోవడం, పెట్రోలు,డీజిలు ధరలు మూడంకెలకు చేరనుండటం. ముడి చమురు ధరలు పెరగుతుండటం, ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధం ఫలితంగా కరెంట్ ఖాతాలోటు బాగా పెరిగిపోవడం ,వ్యవసాయం సహా పలు కీలక రంగాలు ఇబ్బందులు పడుతుండటం వంటి పలు ఆర్థిక సమస్యలతో భారత్ సతమతమవుతున్న నేపథ్యంలో ఈ నివేదిక విడుదలయింది.ఇన్ని ఇబ్బందుల్లోనూ భారతీయులు భవిష్యత్తు పట్ల ఆశాభావాన్ని వ్యక్తం చేయడం విశేషం. రెండు దశాబ్దాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు సగటు భారతీయుడి ఆర్థిక స్థితి మెరుగుపడిందని, తమ కాలంలో కంటే ఇప్పుడు అన్ని విధాల మెరుగైన పరిస్థితులున్నాయని 65 శాతం మంది భారతీయులు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment