చైనాకు పాక్‌ భారీ షాక్‌! | Amid SC Intervene Pakistan Proposal to China in CPEC | Sakshi
Sakshi News home page

Published Tue, May 8 2018 5:42 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM

Amid SC Intervene Pakistan Proposal to China in CPEC - Sakshi

చైనా జాతీయ పతాకం.. పక్కన పాక్‌ సుప్రీం కోర్టు భవంతి

లాహోర్‌: చైనాకు భారీ షాక్‌ ఇచ్చేందుకు పాకిస్థాన్‌ సిద్ధమైపోయింది. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ (సీపీఈసీ)లో చైనా అజమాయిషీని తగ్గించే దిశగా పావులు కదుపుతోంది. ప్రాజెక్టు పేరిట పాక్‌ సరిహద్దులో చైనా అడ్డగోలుగా భూదందాలకు పాల్పడుతోంది. దీనిని నిలువరించాలని కోరుతూ న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పరిణామాలతో ఒప్పందంలో కీలక సవరణలు చేయాలంటూ చైనా ముందు పాక్‌ ప్రతిపాదన ఉంచింది.

సుమారు 60 బిలియన్ డాలర్ల వ్యయం అంచనాతో చైనా సీపీఈసీ ప్రాజెక్టును 2013లో మొదలుపెట్టింది. ప్రాజెక్టు ప్రారంభం అయ్యాక లీజు తీసుకున్న భూముల్లో చైనీయులు కొందరు ప్రైవేట్‌ నిర్మాణాలు చేపట్టారు. రిక్రియేషనల్‌ పార్కులు, నివాస కాలనీలు నిర్మిస్తూ వ్యాపారం చేస్తున్నారు. ఒప్పందంలో ఎలాంటి షరతులు లేకపోవటంతో ఈ వ్యవహారం యథేచ్ఛగా సాగుతూ వస్తోంది. దీంతో జఫరుల్లా ఖాన్‌ అనే న్యాయవాది సుప్రీం కోర్టులో సోమవారం ఓ పిటిషన్‌దాఖలు చేశారు. 

చైనా మోసం చేస్తోంది... ‘చైనా తీరు అభ్యంతరకరంగా ఉంది. పాక్‌ గౌరవానికి భంగం కలిగించేలా బీజింగ్‌ వర్గాలు వ్యవహరిస్తున్నాయి. లీజుల పేరిట భారీ దోపిడీకి తెరలేపారు. పైగా ప్రాజెక్టు కొనసాగుతున్న ప్రాంతాల్లో నివసించే పౌరులను బానిసలుగా చూస్తున్నారు. ఈస్టిండియా కంపెనీ రెండు శతాబ్ధాలపాటు ఉపఖండాన్ని ఎలా దోచుకుందో.. ఇప్పుడు చైనా తీరు కూడా అలాగే ఉంది. ఏకపక్ష ఒప్పందం చేసుకుని చైనా లాభాలను పొందుతోంది. పాక్‌ వ్యాపారస్థులకు చైనాలో సరైన గౌరవం ఉండదు. కానీ, వారు పాక్‌లో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. సీపీఈసీలోని ఒప్పందాలను సమీక్షించి.. సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు పాక్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి. పాక్‌ సార్వభౌమత్వాన్ని కాపాడండి’ అని జఫరుల్లా బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తరుపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘.పిటిషనర్‌ వాదనల్లో వాస్తవం లేకపోలేదని, కానీ, సీపీఈసీ ఒప్పందంలో సవరణల కోసం చైనా ముందు ఇప్పటికే ప్రతిపాదనలు పాక్‌ ప్రభుత్వం ఉంచిందని.. అది పెండింగ్‌లో ఉందని’  వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

పాక్‌ కూడా అసంతృప్తి... ఈ మెగా ప్రాజెక్టుపై పాక్‌ మొదటి నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కీలక ప్రాజెక్టులో తమకు తగినంత ప్రాధాన్యం లభించట్లేదని, పైగా నిధుల విషయంలోనూ చైనా ఇబ్బందులకు గురి చేస్తోందంటూ ఆరోపించింది. ప్రాజెక్టులో భాగంగా రోడ్లు నిర్మించేందుకు చైనా జైళ్ల నుంచి పెద్ద ఎత్తున ఖైదీలను తరలించగా.. పాక్‌ పార్లమెంట్‌లో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. దీంతో ఖైదీలను వెనక్కి తీసుకోవాలంటూ చైనాను పాక్‌ కోరింది. కానీ, అది జరగలేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే, ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత లోపాలు బయటపడటం, గ్వదార్‌ వద్ద భూకంపం వాటిల్లే అవకాశాలు ఉన్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో నిర్మాణంలో మార్పులు చేపట్టాలని చైనాను పాక్‌ కోరింది. కానీ, చైనా మాత్రం ఏ విషయంలోనూ వెనక్కి తగ్గకపోవటం పాక్‌కు విసుగు పుట్టిస్తోంది. ఇప్పుడు కోర్టు విచారణ నేపథ్యంలో ప్రాజెక్టులో సవరణలు తప్పనిసరిగా చేయాలని, ఆధిపత్యాన్ని తగ్గించుకోవాలని, అలాకాని పక్షంలో ప్రాజెక్టును నిలువరించే ప్రయత్నం చేస్తామని పాక్‌ చైనాకు సంకేతాలు పంపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement