
పోలీసులకు వ్యతిరేకంగా నినదిస్తున్న విద్యార్థులు
ఢాకా, బంగ్లాదేశ్ : ఒక్క ఘటన బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను కుదిపేసింది. ఒక్కచోట ఏకమైన వేలాది మంది విద్యార్థులు శాంతి భద్రతలను ఎలా కాపాడాలో పోలీసులకు నేర్పించి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. గత నెల 30న ఢాకా నడిబొడ్డున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటనతో ఢాకాలోని విద్యార్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. ఈ నెల 2వ తేదీన(గురువారం) వేలాదిగా ఏకమై శాంతిభద్రతలను తమ చేతిలోకి తీసుకున్నారు. ప్రధాన రహదారుల్లో బారికేడ్లను ఉంచి, వాహనాల పేపర్లను తనిఖీ చేస్తూ, ప్రభుత్వ అధికారులు విధుల నిర్వహణ అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డారు.
చట్టం అందరికీ వర్తిస్తుంది..
ఢాకాలోని ఓ వీధిలో బైక్‌పై వస్తున్న ట్రాఫిక్ పోలీసు బైక్‌ను పలువురు విద్యార్థులు అడ్డగించారు. అనంతరం అతన్ని బైక్ పేపర్స్, లైసెన్స్ చూపించాలని కోరారు. సదరు పోలీసు నీళ్లునమలడంతో చట్టం అందరికీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. తాను పేపర్లు తీసుకురాలేదని, దయచేసి క్షమించాలని ఆయన విద్యార్థులను కోరారు.
మరో సంఘటనలో పోలీసు వ్యాన్‌ను అడ్డగించిన ఓ విద్యార్థి బృందం వెనక్కు వెళ్లిపోవాలని నినాదాలు చేసింది. రాంగ్ రూట్‌లో వస్తున్న ఓ మంత్రిని సైతం విద్యార్థులు అడ్డగించారు. పోలీసులకు లంచాలు ఇచ్చి, నాయకులు ఎలా పబ్బం గడుపుకుంటున్నారన్న విషయంపై విద్యార్థులు మంత్రికి క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. చట్టం అందరికీ సమానమే అన్న సంగతి గుర్తుంచుకోండంటూ మంత్రికి విద్యార్థులు హితవుపలికారు.
ఫేస్‌బుక్‌లో వైరల్..
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారాయి. అయితే, దురదృష్టవశాత్తు ఈ ఘటనతో సంబంధం లేని ఫొటోలు(నకిలీవి) కూడా ఎక్కువ షేర్ అయ్యాయి.
ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో ‘కోటా సంస్కరణలు’కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. 1971లో స్వతంత్రం అనంతరం దేశం కోసం నిలబడిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం కోటాను ప్రకటించింది. 47 ఏళ్లుగా కోటా వ్యవస్థ వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని విద్యార్థులు రోడ్లెక్కారు. దీంతో దిగొచ్చిన హసీనా సర్కారు కోటాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment