ఐఫోన్‌ ప్రేమికులకు శుభవార్త | Apple to open first retail store in India next year | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ ప్రేమికులకు శుభవార్త

Published Thu, Feb 27 2020 11:19 AM | Last Updated on Thu, Feb 27 2020 2:14 PM

Apple to open first retail store in India next year - Sakshi

ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ (ఫైల్‌ ఫోటో)

కాలిఫోర్నియా: ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన వినియోగదారులకు  ఊరటనిచ్చే అంశాన్ని వెల్లడించింది.  ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తన సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. అలాగే 2021 నాటికి తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్  ఏర్పాటు కానుందని స్వయంగా ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.  తద్వారా భారతీయ వినియోగదారులకు నేరుగా ఆన్‌లైన్‌లోనే ఐఫోన్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఆపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తులను థర్డ్‌పార్టీ రీటైలర్ల ద్వారా విక్రయిస్తోంది.

కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో ఈ విషయాన్ని టిమ్‌ కుక్‌ వెల్లడించారు. దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని, దీనికి సంబంధించిన అనుమతులను భారత  ప్రభుత్వం నుండి పొందాల్సి వుందని కుక్ చెప్పారు. తమ బ్రాండ్‌ను మరెవరో​ నడపాలని తాను కోరుకోవడంలేదన్నారు. అంతేకాదు తమకు భారత్ చాలా కీలకమై మార్కెట్ అని గట్టిగా విశ్వసించే కుక్ 2020 జూన్,  జూలై మధ్య  ఇండియాలో పర్యటించనున్నారు. భారత్‌లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్‌లైన్,  ఆఫ్‌లైన్‌ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 2019 ఆగస్టులో భారత ప్రభుత్వం  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)నిబంధనల సడలింపుల నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ను  ముంబైలో ప్రారంభించనుందని అంచనాలొచ్చాయి. అయితే లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు  పలు అంచనాలు వెలువడ్డాయి.  (చదవండి : శాంసంగ్‌కు బై, ఆపిల్‌కు సై : వారెన్‌ బఫెట్‌)

కాగా  డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ భారతదేశంలో 925,000 ఐఫోన్లను రవాణా చేసిందని పరిశోధనా సంస్థ కెనాలిస్ అంచనా. ఈ సంఖ్య సంవత్సరంలో దాదాపు 200 శాతం పెరిగింది. అయితే దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులపై కేంద్రం విధించిన భారీ దిగుమతి సుంకం ఆపిల్‌కు భారతీయ స్మార్ట్‌మార్కెట్లో  పెద్ద సవాలు. ఈ నేపథ్యంలోనే  ఆపిల్ కాంట్రాక్టర్లు ఫాక్స్కాన్, విస్ట్రాన్  సహకారంతో ఐఫోన్లు అసెంబ్లింగ్‌  ద్వారా పలు రకాల ఐఫోన్ మోడళ్లను  (ప్రస్తుత తరం శ్రేణి మినహా) తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశంలో సొంత దుకాణాలను ప్రారంభించే ముందు సబ్సిడీ, దిగుమతి సుంకాల సడలింపుపై  భారత ప్రభుత్వంతో గత కొంతకాలంగా చర్చలు జరుపుతున్న సంగతి  తెలిసిందే. 

చదవండి : ఆపిల్‌ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement