చేప నూనెల కాప్స్యూల్స్ మంచివే..
చేప నూనెలతో కూడిన కాప్స్యూల్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వులు కలిగించే దుష్ర్పభావాలను తగ్గించుకోవచ్చునని బ్రెజిల్‌లోని సాపాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిరూపించారు. ఊబకాయాన్ని నివారించేందుకు, మధుమేహాన్ని అడ్డుకునేందుకు ఇవి ఎంతో మేలు చేస్తాయని పేర్కొంటున్నారు. కొవ్వు పదార్థాలపై చేప నూనెలోని ఒమేగా 3 ఫాటీఆమ్లాల ప్రభావంపై శాస్త్రవేత్తలు ఎలుకలపై పరిశోధనలు జరిపారు. నాలుగు వారాల పాటు వాటికి అధికంగా కొవ్వులున్న ఆహారపదార్థాలను అందించారు. ఆ తర్వాత వీటికి చేపనూనెలను ఇచ్చారు.
వీటి కొవ్వులను చేపనూనె తీసుకోని ఎలుకల కొవ్వుతో పోల్చిచూశారు. చేపనూనెలు తీసుకున్న ఎలుకల్లో ఇన్సులిన్ నిరోధకత తక్కువగా ఉందని, జీవక్రియలు మరింత మెరుగ్గా ఉన్నాయని మారియా ఇసబెల్ అలోన్సో అనే పరిశోధకుడు పేర్కొన్నారు. ఊబకాయాన్ని, ఇన్సులిన్ నిరోధకతను ఎదుర్కొనేందుకు చేపనూనెలను తీసుకోవడం ఎంతో మేలని తమ పరిశోధన స్పష్టం చేస్తోందని ఆమె తెలిపారు.