
ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి..
అడెన్: యెమెన్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారు. దేశ దక్షిణ ప్రాంతంలోని సిటీ అడెన్‌లో ఆదివారం సైనికులు తమ జీతాలు తీసుకోవడానికి గుంపుగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
ఓ ఉగ్రవాది సైనికుల గుంపులో కలిసిపోయి భారీ పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చేసుకున్నాడని సీనియర్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అడెన్‌లోని అల్- సోల్బాన్ మిలిటరీ బేస్‌లో ఈ దాడి జరిగింది. వారం రోజుల క్రితం అడెన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇదే తరహాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. వరుస ఆత్మాహుతి దాడులు ఎమెన్ సైనికులను బెంబేలెత్తిస్తున్నాయి.