Aden
-
ఉగ్రవాది సైనికుల్లో కలిసిపోయి..
అడెన్: యెమెన్‌లో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సైనికులు మృతి చెందారు. దేశ దక్షిణ ప్రాంతంలోని సిటీ అడెన్‌లో ఆదివారం సైనికులు తమ జీతాలు తీసుకోవడానికి గుంపుగా ఉన్న సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ ఉగ్రవాది సైనికుల గుంపులో కలిసిపోయి భారీ పేలుడు పదార్థాలతో తనను తాను పేల్చేసుకున్నాడని సీనియర్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించారు. అడెన్‌లోని అల్- సోల్బాన్ మిలిటరీ బేస్‌లో ఈ దాడి జరిగింది. వారం రోజుల క్రితం అడెన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఇదే తరహాలో జరిపిన ఆత్మాహుతి దాడిలో 48 మంది సైనికులు మృతి చెందగా.. 29 మంది గాయపడ్డారు. వరుస ఆత్మాహుతి దాడులు ఎమెన్ సైనికులను బెంబేలెత్తిస్తున్నాయి. -
యెమెన్ నుంచి స్వదేశానికి చేరిన భారతీయులు
ముంబై: యెమెన్ సంక్షోభంలో చిక్కుకున్న 190 మంది భారతీయులు ఈ రోజు తెల్లవారుజామున భారత వైమానికి దళానికి చెందిన విమానంలో ముంబై చేరుకున్నారని ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. మరో విమానం ద్వారా 169 మంది కేరళలోని కొచ్చిలో దిగారని తెలిపారు. వారందరిని వారివారి స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టిందని ఉన్నతాధికారులు వివరించారు. యెమెన్‌లో సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను ఐఎన్ఎస్ సుమిత్ర ద్వారా జిబౌతిలోని పోర్ట్ సిటీ అడెన్ నగరం చేర్చగా... అక్కడి నుంచి వారందరిని భారతీయ వాయు సేనకు చెందిన విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్నారు. దాదాపు 4 వేల మంది భారతీయులు యెమెన్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వారందరిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర మంత్రి వీకే సింగ్ ఇప్పటికే జిబౌతి చేరుకుని చర్యలు చేపట్టిన విషయం విదితమే.