
మెల్‌బోర్న్ : గే చట్టాలకు ఇటీవల పలు దేశాలు సూత్రప్రాయంగా అంగీకారం తెలుపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఓ బిల్లును ప్రవేశపెట్టింది. తాజాగా దీనిపై చర్చ జరుగుతుండగా.. సభలో ఓ ఎంపీ చేసిన పని విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆస్ట్రేలియా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన బిల్లుపై చర్చిస్తున్న సమయంలో ఎంపీ టిమ్ విల్సన్ భావోద్వేగానికి గురయ్యాడు. ఎందుకంటే అతని భాగస్వామి అయిన ఎంపీ రాయన్ ప్యాట్రిక్ బోల్జర్ అక్కడే ఉన్నాడు కాబట్టి. చర్చలో ప్రసంగించిన అనంతరం చివరకు... ‘‘ఇక మిగిలింది ఒక్కటే. ప్యాట్రిక్... నన్ను పెళ్లి చేసుకుంటావా?’’ అని భావోద్వేగంతో అడిగాడు. అంతే సభలోని సభ్యులంతా హర్షధ్వానాలు చేశారు. సంతోషంతో బోల్జర్ అవును అని చెప్పటంతో కరతాళ ధ్వనులతో సభ మారుమోగిపోయింది. ఆపై డిప్యూటీ స్పీకర్ రాబ్ మిచెల్ల్ ఆ జంటకు అభినందనలు తెలియజేస్తూ ఇది ఎంతో అరుదైన క్షణం అని వ్యాఖ్యానించాడు.
గత ఏడేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. కానీ అక్కడ స్వలింగ వివాహాలపై నిషేధం ఉండటం కారణంగా పెళ్లి చేసుకోలేక పోయారు. త్వరలో ఆ నిషేధం ఎత్తివేయనున్న నేపథ్యంలో టిమ్ ఇప్పుడు ప్రపోజ్ చేశాడన్న మాట. గత వారం ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా.. ఇప్పుడు దిగువ సభ కూడా ఆమోదించింది. త్వరలోనే ఆ చట్టం అమలులోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment