
సిడ్నీ : అత్యంత ప్రమాదకరమైన మెథాంఫేటమైన్ డ్రగ్ సరఫరాకు సంబంధించిన కేసును ఆస్ట్రేలియా పోలీసులు ఛేదించారు. 300 ఆస్ట్రేలియన్ డాలర్లు విలువ చేసే 400 కిలోల ఐస్‌ప్యాక్‌లు కలిగిన చిల్లీ బాటిల్స్‌ను న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు సీజ్ చేశారు. అక్టోబర్ 15 న అమెరికా నుంచి దిగుమతి అయిన 768 చిల్లీ బాటిల్స్‌లో అత్యంత శక్తివంతమైన మెథాంఫేటమైన్ డ్రగ్‌ను ఐస్ క్రిస్టల్స్ రూపంలో నింపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సిడ్నీ ఎయిర్‌పోర్ట్‌లోని కార్గో డిఫోలో వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో మొత్తం నలుగురి హస్తం ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో బస చేస్తున్న నిందితులను వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. వారు ప్రయాణిస్తున్న కారులో నుంచి ఎనిమిది, హోటల్ రూమ్ నుంచి మరో 26 బాక్సులను సీజ్ చేసినట్లు తెలిపారు.
'ఇది చాలా సంక్లిష్టమైన కేసు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న మెథాంఫేటమైన్‌ను వెలికి తీయడానికి సిడ్నీ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఒక రహస్య ప్రయోగశాలలో దీనికి సంబంధించిన ప్రక్రియను జరుపుతున్నట్లు తెలిసిందని' స్టేట్ క్రైమ్ కమాండర్ స్టువర్ట్ స్మిత్ ప్రకటనలో తెలిపారు. ఐస్ రూపంలో ఉండే 'మెథాంఫేటమైన్' అనేది అత్యంత శక్తివంతమైన డ్రగ్సలో ఒకటి. తాజా గణాంకాల ప్రకారం 2018 సంవత్సరంలో జూన్ వరకు రికార్డు స్థాయిలో 30.6 టన్నుల 'మిథైలాంఫేటమిస్'ను సీజ్ చేసినట్లు ఆస్ట్రేలియన్ క్రైమ్ ఇంటెలిజెన్స్ కమిషన్ తమ నివేదికలో వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment