ఓ ఆస్ట్రేలియా మహిళ సుదీర్ఘంగా అన్వేషించి మరీ స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది. తనకు మొదటి బిడ్డ పుట్టడానికి వీర్యదానం చేసిన వ్యక్తిని జీవిత భాగస్వామిని చేసుకుంది.
బ్రిటన్‌లో జన్మించి ఆ తర్వాత ఆస్ట్రేలియా పౌరసత్వం పొందిన అమిన్హా హర్ట్ తన అనుభవాలతో ఇటీవల ఓ పుస్తకం రాసింది. తనకు వీర్యదానం చేసేందుకు ముందుకొచ్చిన వారి జాబితాలో స్కాట్ అండర్సెన్ అనే 45 ఏళ్ల రైతును ఆమె ఎంపిక చేసింది. తాను సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నానని అతను చెప్పడంతో అతన్ని అంగీకరించింది. ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) ద్వారా ఈ జంటకు లీల అనే కూతురు జన్మించింది. ఐవీఎఫ్ విధానంలో మానవ శరీరం బయటే అండాన్ని వీర్యం ద్వారా ఫలదీకరణ చేస్తారు.
లీలా జన్మించిన తర్వాత వీర్యదానం చేసిన స్కాట్ ఎక్కడున్నాడని హర్ట్ ఆరా తీసింది. చివరకు ఐవీఎఫ్ ఆస్పత్రి ద్వారా అతని వివరాలు కనుక్కుంది. తమకు పుట్టిన బిడ్డ అచ్చం తనలాగే ఉండటంతో స్కాట్ ఆశ్చర్యపోయాడు. 'చిన్నారి ఎలా ఉందో చూడాలని ఉండటంతో మొదట ఆమెను కలిశాను. ఆ తర్వాత ఆమె పట్ల నాలో ప్రేమ మొదలైంది' అని స్కాట్ చెప్పాడు.
నిజానికి గతంలో ఇద్దరు వ్యక్తులతో ఆమె అనుబంధం నెరిపింది. ఈ ఇద్దరి ద్వారా పుట్టిన ఇద్దరు పిల్లలు చిన్నవయస్సులోనే ప్రాణాలు విడిచారు. తనకు జన్యుపరమైన సమస్య ఉండటం వల్ల ఇలా జరిగింది. ఒకవేళ తనకు ఓ బిడ్డ ఉండి ఉంటే తాను వీర్యదాత కోసం, ఐవీఎఫ్ విధానం కోసం ప్రయత్నించేదానిని కాదని హర్ట్ తెలిపింది. ఆమె జీవితకథ త్వరలోనే సినిమాగా వచ్చే అవకాశం కనిపిస్తోంది.
వెతికి మరీ ఆమె స్పెర్మ్ డోనర్‌ను పెళ్లాడింది!
Published Sun, Mar 27 2016 2:27 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 PM
Advertisement