పాపం.. ఆయేషా జిత్తులు పారలేదు! | Ayesha Ahmed, 27, jailed for three months for cheeting the officials | Sakshi
Sakshi News home page

పాపం.. ఆయేషా జిత్తులు పారలేదు!

Published Thu, Apr 28 2016 3:40 PM | Last Updated on Tue, Aug 28 2018 7:15 PM

పాపం.. ఆయేషా జిత్తులు పారలేదు! - Sakshi

పాపం.. ఆయేషా జిత్తులు పారలేదు!

నేరానికి శిక్ష తప్పదన్న న్యాయశాస్త్ర మూల సూత్రం ఆమెకు తెలియదనుకుంటే పొరపాటే. ఎందుకంటే 27 ఏళ్ల ఆయేషా అహ్మద్ రాజనీతి శాస్త్రంలో పట్టా కూడా పుచ్చుకుందిమరి. గోటితో పోయేదాన్ని పోనివ్వకుండా ఎత్తులు, జిత్తులతో గొడ్డలిదాకా తెచ్చుకుంది. నిజానికి ఆమె చేసింది పెద్ద నేరమేమీకాదు. అయితే శిక్ష నుంచి బయటపడడానికి అతితెలివికిపోయి, చిక్కుల్లోపడింది! చివరికి మూడు నెలల కారాగార శిక్షకు గురైంది. ఇంతకీ ఆయేషా ఏంచేసిందంటే..

స్పీడ్ లిమిట్ ఉన్నచోట కారును వేగంగా నడిపింది. అంతేనా? అంతేకాదు అలా నడిపింది తానుకాదని, వేరొకరని అధికారులను నమ్మించేందుకు ప్రయత్నించింది. పోలీసులు తమదైన శైలిలో విచారించేసరికి నిజం కక్కేసింది. కారు స్పీడుగా నడిపినందుకు ఆమెకు పడిన ఫైన్ 85 పౌండ్లు (దాదాపు రూ.8 వేలు). ఆ నేరం నుంచి తప్పిచుకునేందుకు ఓ ఫేక్ లాయర్ కు ఆమె చెల్లించిన ఫీజు 450 పౌండ్లు (దాదాపు రూ. 44 వేలు). వెస్ట్ మిడ్ ల్యాండ్స్ (బ్రిటన్) లోని డుడ్లేలో నివసించే అయేషా అహ్మద్ 2014లో ఓ పార్టీ నుంచి తన బీఎండబ్ల్యూ కారులో తిరిగొస్తూ గంటకు 50 కిలోమీటర్లు మాత్రమే వెళ్లాలని స్పీడ్ లిమిట్ ఉన్నచోట్ 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ట్రాఫిక్ పోలీసులు అమర్చిన కెమెరాకు చిక్కింది. ఐదు నిమిషాల వ్యవధిలో రెండుసార్లు రూల్స్ బ్రేక్ చేసిన ఆయేషాకు తర్వాతి రోజు ట్రాఫిక్ పోలీసులు చలాన్ పంపారు. అప్పుడు మొదలైంది అసలు కథ..

ఎవరిద్వారా తెలుసుకున్నాడోగానీ ఓ లాయర్ ఆయేషాకు ఫోన్ చేసి, ఫైన్ తప్పేలా చేస్తానన్నాడు. సరేనని ఒప్పుకున్న ఆమె మరో వ్యక్తి ద్వారా రూ. 44 వేల ఫీజును లాయర్ కు చెల్లించింది. సదరు లాయర్.. ఆయేషా ఏ తప్పూ చేయలేదని, అప్పుడు కారు డ్రైవ్ చేసింది ఆమె కాదు, వేకొక వ్యక్తి అని అధికారులకు ప్రతినోటీసులు పంపాడు. కెమెరాలో దృశ్యాల్లోనేమో ఆయేషానే కారు డ్రైవ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి లాయరేమో అలా కాదంటున్నాడు. దీంతో ఉన్నతాధికారులు కేసును సీరియర్ గా తీసుకుని లోతుపాతుల్ని పరిశీలించారు.

సదరు ఫేక్ డ్రైవర్.. వేరే కేసుల్లోనూ నిందితుడిగా ఉండటంతో పోలీసుల పని సులువైంది. ఆ తర్వాత ఆయేషాను అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రైవ్ చేసింది తానేనని, ఒక ఫేక్ లాయర్ చేతిలో మోసపోయానని మొత్తం చెప్పేసి.. శిక్ష తగ్గించాలని కోరింది. కోర్టు మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోలేదు. 'ఇంత చదువుకున్న నీకు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాననే విషయం తెలియదంటే మేం నమ్మం. శిక్ష పడితేగానీ నువ్ దారికిరావు' అంటూ మూడు నెలల జైలు శిక్ష విధించాడు వోల్వెరాంప్టన్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి. శిక్షతోపాటు 58 వారాల పాటు ఆయేషా లైసెల్స్ కూడా రద్దయింది. పాపం ఆయేషా..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement