చివరిగా ఒబామా రాసిన రెండు లేఖలు..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఒరాక్ ఒబామా చివరి సమయంలో రెండు లేఖలు రాశారు. ఒకటి కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డోనాల్డ్ ట్రంప్‌కు కాగా మరొకటి తనను ఎంతగానో ప్రేమించి ఆదరించిన ప్రజలకు. అయితే, ట్రంప్‌కు రాసిన లేఖలో ఏముందో చెప్పకుండా నేరుగా ఆయనకే ఇస్తానని చెప్పిన ఒబామా ప్రజల లేఖను మాత్రం బహిరంగ పరిచారు. తనకు ప్రజలే ముఖ్యం అని, అన్నింటికంటే ముందని చెప్పిన ఆయన ఆ లేఖలో తాను ప్రజలను ఎంతగా ప్రేమిస్తానో.. ఎంతగా అనుసరిస్తానో.. ఎంత పరిశీలిస్తానో చెప్పారు.
‘45వ అధ్యక్షుడు(ట్రంప్)కి ఓ లేఖను ఇవ్వడానికి ముందే నేను మీ ఇందరికీ ఈ లేఖ ద్వారా ధన్యవాదాలు చెప్పాలని భావిస్తున్నాను. 44వ అధ్యక్షుడికిగా నాకు బాధ్యతలు కట్టబెట్టి నన్ను గౌరవించి సేవలు అందించేలా నడిపించినందుకు చివరి కృతజ్ఞతలు. నేను నా కార్యాలయంలో నేర్చుకున్న విషయాలన్నీ కూడా మీ నుంచి నేర్చుకున్నవే. నన్ను మంచి అధ్యక్షుడిగా, మంచి వ్యక్తిగా మార్చింది మీరే. ఈ ఎనిమిదేళ్ల కాలంలో నాకు మంచి తోడ్పాటునందించారు.
సంయమనంగా శాంతితో వ్యవహరించారు. ఇది నా బలాన్ని మరింత రెట్టింపుచేసింది. ఆర్థిక సంక్షోభాలు తలెత్తిన ప్రతిసారి మన సమాజంలోని భిన్నవర్గాలు, ఇరుగుపొరుగు సహకరించుకునే తీరును నేను స్వయంగా చూశాను. తమవారిని కోల్పోయి దుఃఖంతో చార్లెస్టన్ చర్చ్‌లో ఉపశమనం పొందేవారి తరుపున నేను కూడా దుఃఖించాను. నేను యువకులైన గ్రాడ్యుయేట్ల, కొత్తగా మిలటరీలో చేరిన అధికారుల హృదయాల్లో చోటుసంపాధించాను. యుద్ధంలో గాయపడి అవయవాలు కోల్పోయి ఇక మరణమే దిక్కు అనేలా ఉన్నవారికి తిరిగి పునరుజ్జీవం పోసిన గొప్ప శాస్త్రవేత్తలను మన దేశంలో కళ్లారా చూశాను.
చాలా ఏళ్లుగా చూస్తున్నాను.. ఎంతోమంది అమెరికన్లు సురక్షితంగా ఉంటున్నారు.. అందుకు కావాల్సిన వైద్యం వారికి అందుబాటులోకి వచ్చింది. కుటుంబ వ్యవస్థల్లో కూడా మార్పు వచ్చింది.. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నవారి వివాహాలన్నింటికి సమాన గుర్తింపు భద్రత వచ్చింది. శరణార్థుల కోసం తపించే, శాంతికోసం పాటుపడుతుంటే గొప్ప యువతను కూడా నేను మన దేశంలో చూశాను. అమెరికా ప్రజలంటే మర్యాద, ధృడ సంకల్పం, మంచి హాస్యచతురతతోపాటు గొప్ప దయగలిగినవారు.
అమెరికా పౌరులుగా ఒక్క ఎన్నికల సమయంలోనో లేక స్వల్పకాలిక స్వప్రయోజనాలకోసం ఆరాటపడే సమయంలోనో కాకుండా మొత్తం జీవితకాలం బతికేయాలి.. సంతోషంగా బ్రతికేయాలి. మీరు నిర్ణయం తీసుకొని వేసే ప్రతి అడుగులో నేను మీతో ఉంటాను. ఆర్థిక పురోగతి నెమ్మదించినప్పుడు అమెరికా అంటే ఏ ఒక్క వ్యక్తి ప్రాజెక్టు కాదని గుర్తుంచుకోండి.. ప్రజాస్వామ్యంలో ‘మనం’అనే పదం చాలా శక్తిమంతమైన పదం. మనమంతా ప్రజలం.. మనం దేనినైనా అధిగమించాలి.. అవును.. మనం దేనినైనా చేయగలం’ అంటూ ఒబామా తన చివరి లేఖను ముగించారు.