ఎక్కడ చూసినా రక్తమే.. యుద్ధాన్ని తలపించింది
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ దగ్గర సంభవించిన రెండు పేలుళ్లతో బీభత్స వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రక్తమేనని పేలుడుకు 10 నిమిషాల ముందు జెనీవా నుంచి విమానంలో వచ్చిన జాచ్ మౌజోన్ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
'ఇది చాలా పెద్ద పేలుడు. పరిస్థితి దారుణంగా ఉంది... పైకప్పులు కూలిపోయి భయానకమైన పరిస్థితి నెలకొంది. పైప్ లైన్ పగిలి.. బాధితుల రక్తంతో కలిసిపోయి ప్రవహించింది. గాయపడిన వారు, వారి బ్యాగులతో ఈ ప్రదేశమంతా రణరంగంలా మారి భీతిగొల్పింది. శిథిలాల మధ్య నడుచుకుంటూ వెళ్లా. ఇక్కడంతా యుద్ధ సన్నివేశంలా ఉంది' అంటూ జాచ్ మౌజోన్ స్థానిక మీడియాకు వివరించాడు.
మరోవైపు చనిపోయిన వారిలో భారతీయులెవ్వరూ లేరని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అక్కడి భారత రాయబారి మంజీవ్ సింగ్ పురితో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడి వాతావరణం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు.