Salah Abdeslam
-
'నన్ను త్వరగా పారిస్ పంపించండి'
బ్రస్సెల్స్: తనను త్వరగా పారిస్‌కు పంపించాలని ఆ నగరంపై దాడికి పాల్పడి ఇటీవల బ్రస్సెల్స్ పోలీసులకు పట్టుబడిన సలాహ్ అబ్దెస్లామ్ కోరాడు. ఈ విషయాన్ని అతడి తరుపు న్యాయవాది తెలిపాడు. 'వీలయినంత తొందరగా పారిస్ పోయేలా చూడాలని అబ్దెస్లామ్ నన్ను కోరాడు. స్వయంగా తనంతట తానే వివరణ ఇచ్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇది మంచి పరిణామం' అని ఆ న్యాయవాది చెప్పాడు. కాగా, ఫ్రాన్స్‌పై దాడికి సంబంధించి మరింతమంది ఉగ్రవాదుల గురించిన సమాచారం తెలుసుకునేందుకు అతడిని తమ నిర్భందంలోనే ఉంచుకోవాలా లేక పారిస్‌కు బదిలీ చేయాలా అనే విషయంపై బ్రస్సెల్స్ కోర్టు ఈ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
బ్రస్సెల్స్‌లో బాంబులు ఎందుకు పేలాయి?
బ్రస్సెల్స్: ఒకప్పుడు ఐరోపా రాజకీయ, సంస్కృతికి కేంద్ర బిందువుగా భాసిల్లిన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంపై మంగళవారం ఐసిస్ టెర్రరిస్టులు ఎందుకు దాడి చేశారు? పారిస్ దాడుల్లో నిందితుడైన సలాహ్ అబ్దెస్లామ్ను అనే టెర్రరిస్టును అరెస్టు చేసినందుకు నిరసనగానే వారు ఈ వరుస బాంబు పేలుళ్లకు పాల్పడ్డారా? ఈ దాడి వెనక ఆర్థిక, సామాజిక కోణాలు ఏమైనా ఉన్నాయా? యాభై ఏళ్ల క్రితం టర్కీ, మొరొక్కా దేశాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. రానురాను నిరుద్యోగం పెరుగుతూ వచ్చింది. బ్రస్సెల్స్‌లో 40 శాతం మంది యువకులు నిరుద్యోగులే. వలసదారులకు ఫ్రెంచ్, అరబ్ భాషలు తప్ప ఇతర భాషలు రావు. ఉద్యోగం రావాలంటే ఫ్రెంచ్‌తోపాటు ఫ్లెమిష్ లేదా డచ్ తప్పనిసరిగా రావాలి. అంతో ఇంతో ఇంగ్లీషు వచ్చి ఉండాలి. నిరుద్యోగంతో బ్రస్సెల్స్ యువతలో అసహనం పెరుగుతూ వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో ముస్లిం మహిళలు బురఖాలు లేదా నికాబ్లు ధరించరాదంటూ బెల్జియం ప్రభుత్వం 2012లో నిషేధం తీసుకరావడంతో ముస్లిం కుటుంబాల్లో అలజడి మొదలైంది. సౌదీ అరేబియా నుంచి వస్తున్న నిధులతో ఇక్కడ ముస్లిం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. వాటిల్లో ర్యాడికలిజంను నూరిపోస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. చాలా కాలంగా బ్రస్సెల్స్‌లో రాడికల్ గ్రూపులు క్రియాశీలకంగా ఉన్నాయని, వారెప్పుడైన దేశంలో అరాచకం సృష్టించవచ్చని మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఆత్మాహుతి తరహా దాడులు జరిపేందుకు ఓ తరానికి తరం సిద్ధంగా ఉందన్న వార్తలు కూడా స్థానిక మీడియాలో వచ్చాయి. ముఖ్యంగా బ్రస్సెల్స్‌లోని మొలెన్బీక్ ప్రాంతం ఎంతో సమస్యాత్మకమైంది. ఇక్కడే అబ్దెస్లామ్ పట్టుబడింది. అబ్దెస్లామ్ పుట్టింది బ్రెజిల్కాగా పారిస్ దాడుల్లో రింగ్ లీడర్‌గా వ్యవహరించి ఎన్కౌంటర్లో మరణించిన అబ్దెల్హమీద్ అబౌద్ కూడా బ్రెజిల్ పౌరుడే. ప్రపంచ టెర్రరిస్టులతో మొలెన్బీక్ ప్రాంతానికి సంబంధాలు ఉన్నాయి. సిరియా, ఇరాక్‌లో ఐసిస్ టెర్రరిస్టులతో కలసి పోరాడేందుకు ఇక్కడి నుంచి దాదాపు ఐదువందల మంది యువకులు వెళ్లారు. ఇంటెలిజెన్స్ వర్గాల కథనం ప్రకారం వారిలో వందమంది మాత్రమే వెనుతిరిగి వచ్చారు. మిగతా వారిలో కొంతమంది మరణించగా, మిగిలిన వారు ఐసిస్ టెర్రరిస్టులుగా మారిపోయారు. అబ్దెల్స్లామ్ అరెస్టుకు ఆత్మాహుతి దాడులకు సంబంధం ఉందా ? అన్న అంశాన్ని మాత్రం బ్రస్సెల్స్ పోలీసులు ఇంతవరకు తేల్చలేదు. -
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులు
-
ఎక్కడ చూసినా రక్తమే.. యుద్ధాన్ని తలపించింది
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ దగ్గర సంభవించిన రెండు పేలుళ్లతో బీభత్స వాతావరణం నెలకొంది. ఆ ప్రాంతంలో ఎక్కడ చూసినా రక్తమేనని పేలుడుకు 10 నిమిషాల ముందు జెనీవా నుంచి విమానంలో వచ్చిన జాచ్ మౌజోన్ అనే ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 'ఇది చాలా పెద్ద పేలుడు. పరిస్థితి దారుణంగా ఉంది... పైకప్పులు కూలిపోయి భయానకమైన పరిస్థితి నెలకొంది. పైప్ లైన్ పగిలి.. బాధితుల రక్తంతో కలిసిపోయి ప్రవహించింది. గాయపడిన వారు, వారి బ్యాగులతో ఈ ప్రదేశమంతా రణరంగంలా మారి భీతిగొల్పింది. శిథిలాల మధ్య నడుచుకుంటూ వెళ్లా. ఇక్కడంతా యుద్ధ సన్నివేశంలా ఉంది' అంటూ జాచ్ మౌజోన్ స్థానిక మీడియాకు వివరించాడు. మరోవైపు చనిపోయిన వారిలో భారతీయులెవ్వరూ లేరని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అక్కడి భారత రాయబారి మంజీవ్ సింగ్ పురితో మాట్లాడినట్టు ఆయన పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో ఇప్పటివరకు అందిన సమాచారం 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్ల ఘటనతో అక్కడి వాతావరణం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించిన అధికారులు తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. -
బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులు
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధానిలోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. వందమందికి పైగా ఈ పేలుడు భారిన పడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. అయితే, పేలుళ్లకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, పేలుళ్లకు ముందు అరబిక్ భాషలో పెద్దగా అరుపులు వినిపించాయని, కాల్పులు కూడా సంభవించాయని కొంతమంది చెప్తున్నారు. టెర్మినల్స్ భవంతుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో పొగ వెలువడుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కొంత అనుమానానికి తావిస్తోంది. తమ వ్యక్తిని అరెస్టు చేశారన్న కోపంతో ప్రతికార దాడులు చేశారని అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు. -
'చివరి క్షణాల్లో పేల్చేసు కోలేకపోయాను'
బ్రస్సెల్స్: పారిస్ దాడుల సమయంలో చివరి క్షణాలలో తాను పేల్చేసుకోలేక పోయానని ఉగ్రవాది సలాహ్ అబ్దెస్లామ్ తెలిపాడు. గత నవంబర్ లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగిన ఉగ్రదాడుల సూత్రధారి సలాహ్ అబ్దెస్లామ్ని బెల్జియంలో శనివారం అరెస్ట్ అరెస్ట్ చేశారు. తాను సూసైడ్ బాంబర్ ను అని పోలీసుల విచారణలో చెప్పాడు. 4 నెలల నుంచి అతనికోసం వేట ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎట్టకేలకు గత నవంబర్ 13న మారణహోమం సృష్టించి దాదాపు 130 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదిని పట్టుకున్నందుకు ప్రపంచదేశాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి. దాడులు చేసినరోజు తనను తాను పేల్చివేసుకోవాలనే అక్కడికి వచ్చినట్లు వెల్లడించాడు. తన అన్న బ్రహీంను కూడా సూసైడ్ బాంబర్ గా ఉపమోగించుకున్నట్లు పారిస్ దాడుల మాస్టర్ మైండ్ వివరించాడు. బ్రూగ్స్ జైలుకు తరలించేందుకు ముందు బ్రస్సెల్స్ అధికారులు చేపట్టిన విచారణలో నిందితుడు అబ్దెస్లామ్ పారిస్ దాడి ఘటనతో పాటు ఆ రోజు తమ ప్లాన్ ఏంటన్నది చెప్పాడని తెలుస్తోంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతున్న పారిస్ అంతర్జాతీయ స్టేడియం, రాక్ బ్యాండ్ ప్రదర్శన వద్ద, బాతాక్లాన్ థియేటర్లతో పాటు.. పలు కెఫేలపై విచక్షణారహితంగా తూటాలు, బాంబులతో బీభత్సం సృష్టించినట్లు ఒప్పుకున్నాడు.