బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్లో ఆత్మాహుతి దాడులు
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధానిలోని ప్రముఖ విమానాశ్రయం జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు చోట్ల పేలుళ్లు, పక్కనే రైల్వే స్టేషన్ సమీపంలో మరో పేలుడు సంభవించాయి. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో కనీసం 30 మంది మరణించగా, మరో 35 మంది గాయాలపాలయినట్లు తెలుస్తోంది. వందమందికి పైగా ఈ పేలుడు భారిన పడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఎయిర్ పోర్ట్ లో ఉన్నవారంతా భయాందోళనతో కేకలు వేస్తూ పరుగులు పెట్టారు.
అయితే, పేలుళ్లకు గల కారణాలు, నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. అయితే, పేలుళ్లకు ముందు అరబిక్ భాషలో పెద్దగా అరుపులు వినిపించాయని, కాల్పులు కూడా సంభవించాయని కొంతమంది చెప్తున్నారు. టెర్మినల్స్ భవంతుల నుంచి మాత్రం పెద్ద మొత్తంలో పొగ వెలువడుతోంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకోవడం కొంత అనుమానానికి తావిస్తోంది. తమ వ్యక్తిని అరెస్టు చేశారన్న కోపంతో ప్రతికార దాడులు చేశారని అని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా విమానాశ్రయాన్ని మూసివేసి ప్రయాణికులను తరలిస్తున్నారు. నగరంలో హై అలెర్ట్ ప్రకటించారు.