బాటిల్ బాక్సులా..
ఇన్నాళ్లూ వాటర్ బాటిల్ అంటే మనం చూసింది వేరు. ఇది వేరు.. చూశారుగా.. బాటిల్ బాక్సులా మారిపోయింది. దీన్ని ఆస్ట్రేలియాకు చెందిన డిజైనర్లు జెస్సీ లీవర్తీ, జోనాథన్‌లు తయారుచేశారు. ‘మెమోబాటిల్’లో మూడు సైజులున్నాయి. అవి ఏ5, ఏ4, లెటర్. వీటిల్లో ఏ5 సామర్థ్యం 750 మి.లీ. కాగా.. ఏ4, లెటర్‌ల సామర్థ్యం 1.25 లీటర్లు. వీటిని బ్యాగులో లేదా వెనుక జేబులో ఈజీగా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారి కోసం వీటిని తయారుచేశారట.
పాశ్చాత్య దేశాల్లో యూజ్ అండ్ త్రో టైపు వాటర్ బాటిళ్ల వినియోగం ఎక్కువ. వీటిల్లో 20 శాతం మాత్రమే రీసైకిలింగ్ చేస్తున్నారట. ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు ఇది చెక్ పెడుతుందని జెస్సీ, జొనాథన్‌లు చెబుతున్నారు. దీన్ని ఎన్నిసార్లైనా వినియోగించుకోవచ్చని.. శుభ్రపరచడం కూడా చాలా ఈజీ అని అంటున్నారు. మెమోబాటిళ్లు ఈ ఏడాది చివర్లో మార్కెట్లోకి రానున్నాయి.